అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని తాలిబన్ల డిమాండ్‌ .. !

అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని తాలిబన్ల డిమాండ్‌ .. !
అఫ్గన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు, హక్కానీ నేతలు... అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

అఫ్గన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు, హక్కానీ నేతలు... అమెరికా నిషేధిత జాబితా నుంచి తమను తొలగించాలని డిమాండ్‌ చేశారు. బ్లాక్‌ లిస్ట్‌ విషయంలో అమెరికా ప్రస్తుత వైఖరి.. దోహా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని... ఈ తీరు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. హక్కానీ నెట్‌వర్క్‌ ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్‌లో ఒక భాగమని, దీనికి ప్రత్యేక పేరు, సంస్థ అంటూ లేదని చెప్పారు.

నిషేధిత జాబితాను సవరించకపోవడం అంటే.. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నారు. ఈ వైఖరిని అంగీకరించబోమని స్పష్టంచేశారు. దౌత్య చర్చలతో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అన్నారు. కొత్త కేబినేట్‌లోని ప్రధాని ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ సహా దాదాపు 14 మంది సైతం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నిషేధిత జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినవారిని ఈ జాబితాలోకి చేర్చుతారు.

రాయబార కార్యాలయాలతో సహా విదేశాల దౌత్య సంస్థల్లో జోక్యం చేసుకోబోమన్న తాలిబన్లు.. మరోసారి వక్రబుద్ధిని నిరూపించుకున్నారు. కాబుల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని సామగ్రి, పుస్తకాల్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని నార్వే రాయబారి సిగ్వాల్డ్ హౌజ్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

కాబుల్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తామని డెన్మార్క్‌, నార్వే దేశాలు గత నెలలోనే ప్రకటించాయి. తాజాగా 'కాబుల్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్టు డానిష్‌ విదేశాంగ మంత్రి జెప్పే కొఫోడ్ తెలిపారు. రాయబార కార్యాలయాన్ని మూసివేసి... దౌత్యవేత్తలు, సిబ్బందిని ఖాళీ వెనక్కి రప్పిస్తామని నార్వే విదేశాంగ మంత్రి ఇనే సోరైడ్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story