Afghanistan: మహిళలకు సైట్ సీయింగ్ అవసరం లేదు

Afghanistan: మహిళలకు  సైట్ సీయింగ్ అవసరం లేదు
మహిళలపై మరో ఆంక్ష

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారు అయ్యింది. కొత్త కొత్త రూల్స్ తో అక్కడి వారికి కొంచెం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మహిళలకు నరకం చూపెడుతున్నారు. మొదట వారిని చదువు నుంచి దూరం చేశారు. తరువాత ఉద్యోగం నుంచి, క్రీడల నుంచి అన్నింటి నుంచి దూరం చేశారు. ఏది చేసినా నేరమే అనే విధంగా పరిస్థితులను మార్చేశారు.

నిర్నీత దూరం దాటి వారు బయటకు వెళ్లాలన్నా భర్త లేదా ఇతర బంధువులు తోడుగా ఉండాలి. ఐక్యరాజ్యసమితి సంస్థల్లో కూడా మహిళలు పనిచేయొద్దని ఆదేశాలున్నాయి. జిమ్, పార్కులు, స్మిమ్మింగ్ పూల్స్ లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారు. ధరించే దుస్తుల మీద కూడా ఆంక్షలు ఉన్నాయి. ఆఖరికి వారు వేసుకునే హజిబ్ రంగు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు వారికి. ఇక ఇప్పుడు తాలిబన్లు మహిళలు ప్రకృతిని చూసే హక్కు కూడా లేకుండా చేశారు. తాజాగా తాలిబన్లు మహిళలపై మరో ఆంక్ష విధించారు.


దీని ప్రకారం మహిళలకు ఆ దేశంలోని ప్రధానమైన జాతీయ పార్కుల్లో ఒకటైన బండ్-ఈ-అమీర్ పార్కులోకి ప్రవేశం లేదని ఆదేశించారు. దీని గురించి ఆ దేశ ధర్మం మరియు దుర్గుణం శాఖ మంత్రి మొహమ్మద్ ఖలీద్ హనాఫీ మాట్లాడుతూ.. మహిళలు సైట్ సీయింగ్ కు వెళ్లాల్సినంత అవసరం లేదని అన్నారు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు, సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని చెప్పారు. అంతేకాకుండా కొందరు మహిళలు హిజాబ్ వేసుకోవడం లేదని, మరి కొందరు హిజాబ్ ధరించినా దానిని సరిగా వేసుకోవడం లేదని తమకు ఫిర్యాదుల వస్తున్నాయని తెలిపారు. ఇకపై అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళలకు పార్క్ లోకి ఎంట్రీని నిషేధించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు మహిళలను చదువుకు, ఆటకు, ఉద్యోగాలకు దూరం చేసి వారి స్వేచ్ఛను హరించారని, ఇప్పుడు ఏకంగా వారిని ప్రకృతి నుంచి కూడా దూరం చేయడం దారుణమంటున్నారు.


2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో, అక్కడి పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచే అక్కడి ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ కాస్త కాస్త గా హరించుకుపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story