కాబుల్‌లో 150 మందిని కిడ్నాప్‌ చేసి విడిచిపెట్టిన తాలిబన్లు..!

కాబుల్‌లో 150 మందిని కిడ్నాప్‌ చేసి విడిచిపెట్టిన తాలిబన్లు..!
దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు.

దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి మహిళలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తాలిబన్లు గమనిస్తారనే భయంతో సామాజిక మాధ్యమాలను సైతం వారు ఉపయోగించడంలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. తాలిబన్లకు పిల్లల ఏడుపు శబ్ధాలు సైతం వినబడకుండా భయంతో జాగ్రత్తపడుతున్నారు. వీధుల్లోంచి వాహనాలు వెళ్తున్న శబ్దాలు వింటేనే హడలెత్తిపోతున్నారు.

గతవారంతంలో ఆఫ్ఘన్‌ను పూర్తిగా వశం చేసుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆఫ్ఘన్ జైళ్లలోని ఉగ్రవాదులపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనేకమంది ఉగ్రవాదులను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. మైనార్టీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు.

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. వీరిలో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్దు విమానాల కోసం వేచి చూస్తున్న వీరిని తాలిబన్లు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం..వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ పలు ప్రశ్నలు అడిగారు. వారి వద్ద ఉన్న ప్రయాణ వివరాలు పరిశీలించిన తరువాత మళ్లీ వారిని ఎయిర్ పోర్టు వద్దకు చేర్చారు.

తాలిబన్లు భారతీయుల్ని అపహరించారన్న వార్త వైరల్ అవడంతో భారత్‌లో కలకలం రేగింది. అయితే.. తాలిబన్లు మాత్రం ఈ వార్తలను ఖండించారని న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ విలేకరి ఒకరు తాజాగా ట్వీట్ చేశారు. భారతీయులను మరో సురక్షితమార్గంలో ఎయిర్‌పోర్టులోపలికి పంపించామని తాలిబన్లు పేర్కొన్నట్టు సదరు విలేకరి తెలిపారు. కాగా.. వీరందరూ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని భారత అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిని స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ప్రధానంగా ఇన్ని రోజులుగా ఆఫ్ఘన్ జైళ్లలో మగ్గుతున్న 100 మంది పాకిస్తాన్ తీవ్రవాదులను విడిచిపెట్టినట్లు సమాచారం. వీరంతా తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్‌కి చెందిన వారిగా తెలుస్తోంది. అలాగే ఇస్లామిక్ స్టేట్, అల్-ఖయిదా వంటి ఉగ్రమూకలకు సంబంధించిన వారిని కూడా విడిచిపెట్టినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story