Afghanistan : ఇక అందానికి అద్దాల్లేవ్

Afghanistan : ఇక అందానికి  అద్దాల్లేవ్
బ్యూటీ పార్లర్ ల మూసివేతకు ముగిసిన డెడ్లైన్

అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల దమనకాండ కొనసాగుతోంది. తాజాగా తాలిబన్లు వారి జీవనోపాధి మీద దెబ్బకొట్టారు. తాము విధించిన నెల రోజుల డెడ్‌లైన్ ముగియడంతో మహిళలు బ్యూటీ సెలూన్‌లను మూసివేయాలని ఆదేశించారు. వారం క్రితం బ్యూటీషియన్లు తాలిబన్ల తీరును నిరసిస్తూ ఆందోళన చేయగా వాటిపై ఉక్కుపాదం మోపారు. బ్యూటీ సెలూన్‌లపై నిషేధాన్ని ఎత్తివేయడానికి అఫ్గాన్‌లోని సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారు. వారిని ఇప్పటికే ఉన్నత విద్య, ఉద్యోగాల నుంచి దూరం చేశారు. తాజాగా మహిళలు బ్యూటీ సెలూన్‌లను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ల ఆదేశాలను ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు వ్యతిరేకిస్తున్నా అక్కడి ప్రభుత్వం వాటిని పెడ చెవిన పెడుతోంది. తమ ఆదేశాలను పాటించని వారిపై ఏ చర్యలు తీసుకుంటారనే విషయంలో తాలిబన్లు ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.



బ్యూటీ సెలూన్‌లలో అందించే సేవలు ఇస్లాంకు వ్యతిరేకమని తాలిబన్‌ నాయకులు వాదిస్తున్నారు. అలాగే పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి ఇది మరింత ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని వింత వాదనను తెరపైకి తెచ్చారు. తాలిబన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత వారమే కాబుల్‌లో బ్యూటీషియన్లు ఆందోళన చేశారు. బ్యూటీ పార్లర్‌లపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో గుమిగూడారు. జీవనోపాధిని దెబ్బతీసి తమ పొట్ట కొట్టొందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తాలిబన్‌ సేనలు గాల్లోకి కాల్పులు, జల ఫిరంగులను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.

బ్యూటీసెలూన్లు మూసివేయాలని తాలిబన్లు తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాలిబన్ల ఆదేశాలు మహిళా పారిశ్రామికవేత్తలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఐరాస పేర్కొంది. నిషేధం ఎత్తివేతపై అఫ్గానిస్థాన్‌లోని సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మహిళల హక్కులపై పరిమితులు విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని అఫ్గాన్‌లోని ఐరాస సహాయ కమిషన్ ఉనామా తెలిపింది. బ్యూటీ సెలూన్‌ల నిషేధం ఎత్తివేతపై ఉనామా చేస్తున్న ప్రయత్నాలకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తన మద్దతును తెలిపారు. తాలిబన్ల నిర్ణయం వల్ల 60 వేల మంది మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోతారని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ అసోసియేట్ డైరెక్టర్ హీథర్ బార్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story