Afghanistan :ఆఫ్ఘన్ లో దారుణంగా ఉన్న బాలికల పరిస్థితి

Afghanistan  :ఆఫ్ఘన్ లో దారుణంగా ఉన్న బాలికల పరిస్థితి
బాలికల చదువుపై నిషేధం విధించి రెండేళ్లు

అఫ్గానిస్థాన్‌లో బాలికల చదువుపై నిషేధం విధించి రెండేళ్లుపూర్తయ్యింది. దీంతో 10 లక్షలకుపైగా బాలికల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రజలపై అనేక నిషేదాజ్ఞలు విధించిన తాలిబన్లు పౌరుల హక్కులను కాలరాశారు. మహిళలు ఆరో తరగతి దాటి చదవకూడదనే నిబంధన విధించిన ఏకైక దేశంగా అఫ్గాన్‌ అపఖ్యాతి మూటగట్టుకుంది. అంతర్జాతీయ సమాజం మందలించినా తాలిబన్లు వెనకడుగు వేయలేదు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయింది.అప్పటి నుంచి పౌరుల హక్కులను కాలరాయడమే పనిగా పెట్టుకున్న తాలిబన్‌ ప్రభుత్వం మరీ ముఖ్యంగా స్త్రీల హక్కులను అణచివేస్తోంది. మరే దేశంలో లేని విధంగా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆరో తరగతి దాటి.బాలికలు చదువుకోకూడదనే నిబంధనను విధించింది. అంతర్జాతీయ సమాజం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా తాలిబన్‌ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అఫ్గాన్ మహిళలు, పిల్లల హక్కుల అంశాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల్లోని అజెండాలో చేర్చారు. తాలిబన్ల నిషేదాజ్ఞ కారణంగా పది లక్షలకుపైగా బాలికలు ప్రభావితమైనట్టు ఐరాస పిల్లల ఏజెన్సీ తెలిపింది.

అంతర్జాతీయ సమాజం తాలిబన్ల నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదు సరికదా పార్కులు, జిమ్ములు లాంటి బహిరంగ ప్రదేశాల్లోకి స్త్రీలు ప్రవేశాన్ని నిషేధిస్తూ అదనపు ఆంక్షలను విధించారు.వారు మిడిల్ స్కూల్ మరియు హైస్కూల్ నుండి బాలికలను నిషేధించారు, మహిళలను చాలా ఉద్యోగాల నుండి పరిమితం చేశారు మరియు బహిరంగ ప్రదేశాల్లో తల నుండి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే దేశ భవిష్యత్తు చీకట్లో మగ్గిపోవాల్సి వస్తుందని అఫ్గాన్‌ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత 20 ఏళ్లలో అఫ్ఘాన్ మహిళలు సాధించిన పురోగతిని ఇప్పుడు రద్దు చేసినట్లయ్యింది. పాఠశాల నమోదు , పాలనలో పాల్గొనడం నుండి లేబర్ మార్కెట్ యాక్సెస్ వరకు మహిళలు సాధించుకున్న స్వాతంత్య్రాలను ఇప్పుడు తిరిగి కోల్పోవలసి వస్తున్నది. వాస్తవానికి అఫ్ఘాన్ మహిళలు ప్రపంచంలోనే ప్రగతిశీలంగా ఉన్నారు. అక్కడ తాలిబన్ల నిరంకుశ పాలన ప్రారంభం కావడానికి ముందు 1990వ దశాబ్దం ప్రారంభంలో అఫ్ఘానిస్తాన్‌లో 40 శాతం మంది వైద్యులు మహిళలు. పాఠశాల ఉపాధ్యాయుల్లో 70 శాతం, యూనివర్సిటీ ప్రొఫెసర్లలో 60 శాతం, యూనివర్శిటీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది మహిళలు కూడా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు దారుణంగా మారిపోయింది. నేడు మహిళా అక్షరాస్యత 14 శాతం మాత్రమే.


Tags

Read MoreRead Less
Next Story