సినిమా రేంజ్‌లో వైట్‌ హౌజ్‌పై తెలుగు యువకుడి దాడి

సినిమా రేంజ్‌లో వైట్‌ హౌజ్‌పై తెలుగు యువకుడి దాడి
అమెరికా వైట్ హౌస్ సమీపంలో తెలుగు సంతతి యువకుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు

అమెరికా వైట్ హౌస్ సమీపంలో తెలుగు సంతతి యువకుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. కందుల సాయి వర్షిత్ అనే ఈ యువకుడు ట్రక్ తో అతివేగంగా దూసుకొచ్చి సెక్యూరిటీ బారికేడ్లను ఢీ కొట్టాడు. వైట్ హౌస్ నార్త్-వెస్ట్ గేట్ గుండా లోనికి ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. రెండుసార్లు సెక్యూరిటీ బ్యారియర్లను ట్రక్కుతో ఢీ కొట్టాడు. యూ-హాల్ అనే రెంటల్ కంపెనీ ట్రక్ తో ఈ బీభత్సం సృష్టించాడు. దీన్ని గమనించిన భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి.

వెంటనే అతణ్ని అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాజీల పతాకాన్ని ఆ ట్రక్కుపై అతికించినట్లు పోలీసులు గుర్తించారు. కందుల సాయి వర్షిత్ వయస్సు 19 ఏళ్లు. మిస్సోరీలోని ఛెస్టర్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్నాడు. గ్రేటర్ సెయింట్ లూయిస్ ప్రాంతంలోని రాక్‌వుడ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఛెస్టర్‌ఫీల్డ్‌లోని మార్క్వెట్ సీనియర్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

కందుల సాయి వర్షిత్ ను యూఎస్ పార్క్ పోలీసులకు అప్పగించారు వైట్ హౌస్ భద్రతా సిబ్బంది. అనంతరం వాషింగ్టన్ డీసీ సుపీరియర్ కోర్టులో ఆతన్ని ప్రవేశపెట్టారు. ఉద్దేశపూరకంగా వైట్ హౌస్‌లోకి చొరబడే ప్రయత్నం చేసినట్లు నేరాన్ని కందుల సాయి వర్షిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ లేదా వారి కుటుంబ సభ్యులపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే అతను వైట్ హౌస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ట్రక్కులో మారణాయుధాలు గానీ, మందుగుండు సామగ్రి గానీ ఇతర పేలుడు పదార్థాలు లేవని అతని వద్ద మిస్సోరి డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నట్లు కోర్టుకు తెలియజేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story