Hong Kong Rains: దంచికొట్టిన భారీ వర్షాలు

Hong Kong Rains: దంచికొట్టిన భారీ వర్షాలు
140 ఏండ్లలో ఏన్నడూ చూడని భారీ వర్షపాతం

ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు నీట మునగడంతో పాఠశాలలను మూసివేశారు. ఈ మహానగరం 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్షాల కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలయ్యారని అత్యవసర విభాగం తెలిపింది. హాంకాంగ్‌లో గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు 158.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. క్వోలూన్‌, నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి లోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం వరద కారణంగా నగరంలో చాలా చోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు నిలిచిపోయాయి.


నగరంలో అతిపెద్ద వర్షపాత హెచ్చరిక అయిన ‘బ్లాక్‌’ను గురువారం సాయంత్రమే జారీ చేశారు. వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ నీట మునిగింది. దీంతో రైల్వే శాఖ తన సేవలను నిలిపివేసింది. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు మొత్తం నీట మునిగిపోవడంతో పాఠశాలలను మూసివేశారు. హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది. అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద నీటిలో చిక్కుకపోయిన ప్రజలను రక్షించేందుకు అధికారులు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు చైనా మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలామంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నగరాన్ని క్వోలూన్ ద్వీపకల్పంతో అనుసంధానించే మార్గంకూడా వరదల్లో చిక్కుకుంది.


ఇటీవలే అత్యంత బలమైన టైపూన్ బారినపడి కోలుకుంటున్న ఈ నగరంపై తాజా వరదలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. కొండలపై నుంచి నీరు ప్రవహించడంతో ఇరుకైన వీధుల్లో నడుము లోతు వరకు వరదనీరు ప్రవహించింది. మాల్స్, మెట్రో స్టేషన్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


దక్షిణ చైనాలోనూ మరోవైపు దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. 1952 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో వందల కొద్దీ విమానాలు రద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మెరుపు వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story