ట్రంప్ మారిపోయారు.. కోడిని క్షమించేశారు..

ట్రంప్ మారిపోయారు.. కోడిని క్షమించేశారు..
కలలు కల్లలుగా మిగిలిపోవడంతో ఆ షాక్ నుంచి తేరుకుని సాధారణ జీవితం గడపడానికి సమాయత్తమవుతున్నారు.

మరోసారి అధ్యక్షపీఠం అధిరోహించాలని కలలుగన్న డొనాల్డ్ ట్రంప్.. కలలు కల్లలుగా మిగిలిపోవడంతో ఆ షాక్ నుంచి తేరుకుని సాధారణ జీవితం గడపడానికి సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగానే అధ్యక్షుడిగా మిగిలిన కాలానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నారు.

శ్వేత సౌధంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే థ్యాంక్స్ గివింగ్ డేకు ముందు జరిగే ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజ్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు టర్కీ కోళ్లను క్షమించి వదిలేశారు. ఈ రెండు పక్షులు ఐయోవా స్టేట్ యూనివర్శిటీ సంరక్షణలో హ్యాపీగా తిరిగేందుకు అధ్యక్షుడి నుంచి అనుమతి పొందాయి.

కోళ్లను క్షమించడం ఏమిటి.. కొత్తగా ఉంది.. అందులో అమెరికా అధ్యక్షుడు.. ఏంటో ఆ కధ తెలుసుకుందాం..

ప్రతి ఏటా థ్యాంక్స్ గివింగ్ డేకు ముందు అధ్యక్షుడికి ది నేషనల్ టర్కీ ఫెడరేషర్ రెండు భారీ టర్కీ కోళ్లను బహుకరిస్తుంది. వారికి ఇష్టమైతే విందు భోజనంలో ఆరగించేస్తారు. లేదంటే క్షమించి వదిలేస్తారు. ఇదంతా అధ్యక్షుల వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులంతా టర్కీ కోడి రుచిని ఆస్వాదించేవారు.

జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్, జార్జి డబ్ల్యు బుష్ వంటి వారు మాత్రం వీటిని స్వీకరించి వదిలేసేవారు. ఈ కోళ్లను డిస్నీ ల్యాండ్ రిసార్ట్‌కు లేదా వాల్ట్ డిస్నీరిసార్ట్‌కు తరలించేవారు. ఆ తర్వాతి కాలంలో మౌంట్ వెర్నాన్‌లోని జార్జ్ వాషింగ్టన్ ఇంటికి.. లీస్ బర్గ్‌లోని మోర్వెన్ పార్క్‌కు తరలించారు.

అధ్యక్షుడికి ఇచ్చే టర్కీ కోళ్ల ఎంపిక కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మొత్తం 80 పక్షులను ఎంపిక చేసి, అనేక రకాల పరీక్షలు నిర్వహించి.. వాటిలో రెండింటిని మాత్రమే సెలక్ట్ చేసి అధ్యక్షుడికి బహుకరిస్తారు. ఆ రెండింటిని కూడా ఆయా రాష్ట్రాల విద్యార్థుల సూచనల మేరకు శ్వేత సౌధ సిబ్బంది ఎంపిక చేస్తారు.

1863 నుంచే ఉన్న ఆచారం ఇది..

ఆ రోజుల్లో అబ్రహం లింకన్ కుటుంబం విందు కు కోసం టర్కీ కోడిని కొందరు బహుకరించారు. అంతకు ముందు ఏడాదే లింకన్ కుమారులు టెడ్, విలియంలకు టైఫాయిడ్ సోకింది. వ్యాధి తీవ్రతకు విలియం మరణించాడు. టెడ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే టెడ్ ఆ టర్కీ కోడిని విందుకు ఉపయోగించవద్దని సిబ్బందిని, తండ్రిని బతిమాలుకున్నాడు. కుమారుడి కోరికను కాదనలేని తండ్రి కోడికి ప్రాణభిక్ష పెట్టారు. టెడ్ ఆ కోడికి జాక్ అని పేరుపెట్టి పెంచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా వచ్చిన జీవిని పెంచుకున్న తొలి ఘటన ఇదే అని శ్వేతసౌధ వాసులు వివరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story