నచ్చినంత తినండి బిల్లు నాదే అన్న ట్రంప్

నచ్చినంత తినండి బిల్లు నాదే అన్న ట్రంప్
పావు గంటలోనే రెస్టారెంట్ నుండి జంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మద్ధతుదారులకు షాక్‌ ఇచ్చాడు. రహస్య పత్రాల వ్యవహారంలో మియామీ కోర్టుకు హాజరైన ఆయన.. దారిలో లిటిల్‌ హవానాలోని ఓ క్యూబన్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ట్రంప్ రాకతో అతని మద్దతుదారులు ఆనందంలో మునిగిపోయారు. జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. దీన్ని చూసి మురిసిపోయిన ట్రంప్ వాళ్లను ఉద్దేశించి ఫుడ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల అందరి మొహాలు వారికి కనిపించాయి కానీ ట్రంప్ మొహం మాత్రం కనబడలేదు. పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్‌ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఖంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్‌ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్‌ ఆ రెస్టారెంట్‌లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. అంతే కాదు ఆర్డర్ గురించి గానీ పేమెంట్ గురించి గానీ రెస్టారెంట్ వారికి ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్‌ మాత్రం తన ప్రైవేట్‌ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్‌ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు. అయితే, ట్రంప్ వర్గం మాత్రం ఈ వార్తలను ఖండించింది. ట్రంప్ వెళ్లిపోయిన వెంటనే రెస్టారెంట్‌లోని వారు కూడా ఆహారం ఆర్డర్ చేయకుండానే వెళ్లిపోయారని ఆయన తరఫు ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే, వారు పార్సెల్ చేయించుకున్న ఆహారానికి ట్రంప్ బృందం బిల్లు కట్టిందని చెప్పారు. తనకు అద్భుత ఆతిథ్యమిచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారని అన్నారు. మరోమారు కచ్చితంగా ఆ రెస్టారెంట్‌ను సందర్శిస్తారని తెలిపారు.

అధికారిక రహస్య పత్రాలను తన ఇంట్లో దాచిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకంగా 37 అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే కావడం గమనార్హం. ఈ అభియోగాల విషయంలోనే ఆయన తాజాగా మియామీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ అధ్యక్షుని తప్పేమీ లేదని ట్రంప్ తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రంప్ పై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేవని తెలిపిన కోర్టు, ఈ కేసులో సంబంధం ఉన్న సాక్షులు, బాధితులతో ట్రంప్ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని మాత్రం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story