Donald Trump: డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేసే యూదులపై విరుచుకుపడిన ట్రంప్

Donald Trump: డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేసే యూదులపై  విరుచుకుపడిన ట్రంప్
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూదు సంఘాలు, డెమొక్రటిక్ పార్టీ నేతలు

విజయ కాంక్షతో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూదు అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేస్తే యూదు మతాన్ని, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని అసహ్యించుకుంటున్నట్టేనని, ఈ విషయంలో యూదు ఓటర్లు సిగ్గు పడాలని ట్రంప్ అన్నారు. నవంబర్ 5న అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ను గద్దె దించాలని ట్రంప్ కోరారు. డెమొక్రటిక్ పార్టీ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తోందని అన్నారు. ఈ మేరకు తన మాజీ సలహాదారు సెబాస్టియన్ గోర్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.

కాగా ట్రంప్ వ్యాఖ్యలపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వర్గాలు, డెమొక్రటిక్ పార్టీ నేతలు, యూదు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం మతాన్ని ముడిపెట్టి ప్రచారం చేయడం ఏమిటని మండిపడుతున్నారు. యాంటీ-డిఫమేషన్ లీగ్, అమెరికన్ జ్యూయిష్ కమిటీ, యూదు డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాతో పాటు పలు గ్రూపులు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. తోటి పౌరులను బెదిరించే విద్వేష విధానాలు, మూస పద్ధతులు ఏమాత్రం సమర్థనీయం కాదని వైట్ హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు అమెరికాలోని ఇలియ‌నాస్ రాష్ట్రంలో జ‌రిగిన రిప‌బ్లిక‌న్ పార్టీ ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధించారు. రిప‌బ్లిక‌న్ పార్టీ నామినేష‌న్ కోసం కావాల్సిన డెలిగేట్స్ సంఖ్య‌ను ట్రంప్ ఇప్ప‌టికే చేరుకున్నారు. అయితే ఇలియ‌నాస్ గెలుపుతో ఆయ‌న రూట్ మ‌రింత క్లియ‌రైంది. ఇలియ‌నాస్‌లో 64 మంది రిప‌బ్లిక‌న్ డెలిగేట్స్ ఉన్నారు. 2020 ఎన్నిక‌ల్లో ఇలియ‌నాస్‌లో ట్రంప్‌పై బైడెన్ 17 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 2016 ఇలియ‌నాస్ ఎన్నిక‌ల్లో హిల్ల‌రీ క్లింట‌న్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story