Cyber Attack: సైబర్ బాధితులకు ఊరట

Cyber Attack: సైబర్ బాధితులకు ఊరట
ఎఫ్‌ఐఆర్‌ కాకున్నా సొమ్ము అప్పగింత..

సైబర్‌ నేరాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నేరస్థుల లేదా అనుమానితుల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేందుకు సీఆర్పీసీ 457 సెక్షన్ కింద న్యాయస్థానంలో దరఖాస్తు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈమేరకు ఈనెల 9న జరిగే మెగా లోక్అదాలత్‌లో ఆయా కేసులను పరిష్కరించే దిశగా పోలీస్‌శాఖ కసరత్తు వేగవంతం చేసింది.

చాలా వరకు సొమ్ము పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేసినా బినామీ ఖాతాల్లోకి సొమ్ము చేరడంతో నిందితులెవరనేది పోలీసులు సులువుగా గుర్తించలేకపోతున్నారు. అలాంటి ఉదంతాల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలేదు. అయితే... బాధితుల సొమ్మును సదరు ఖాతాల నుంచి ఉపసంహరించకుండా జప్తు చేయగలుగుతున్నారు. 25వేల లోపు పోగొట్టుకున్న ఉదంతాల్లో బాధితులకు ఆ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు తాజాగా కసరత్తు చేపట్టారు. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా 18వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము సుమారు 16 నుంచి 18 కోట్లుంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాంటి కేసుల దర్యాప్తుల్లో అధికారులంతా సంబంధిత న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయా యూనిట్ల ఉన్నతాధికారులకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అన్ని యూనిట్లలో కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.

కాజేసిన సొమ్మును స్తంభింపజేయడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగంగా పనిచేస్తుంది. కానీ.. సైబర్ నేరస్థుల బారిన పడి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి దక్కించుకోవడం మాత్రం అంత సులువైన విషయం కాదని తెలిసిందే. ఒకవేళ నేరస్థులను గుర్తించినా అప్పటికే డబ్బును ఖర్చు చేసేస్తుండటంతో బాధితులకు రిక్తహస్తమే మిగులుతోంది. ఇండియన్ సైబర్‌క్రైమ్కో -ఆర్డినేషన్ సెంటర్ తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సైబర్‌క్రైమ్‌ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. బాధితులు 1930కు ఫోన్ చేసినా.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించి నేరస్థుల బ్యాంకు ఖాతాలను గుర్తించే పనిలో నిమగ్నమవుతారు. ఈక్రమంలోనే పెద్దమొత్తంలో సొమ్మును సైబర్‌ నేరస్థుల చేతికి చిక్కకుండా ఆపగలుగుతున్నారు. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనతికాలంలోనే ప్రత్యేకతను చాటుకుంది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే 89,783 ఫిర్యాదులను ఇది పర్యవేక్షించడం గమనార్హం. దేశవ్యాప్తంగా నమోదైన ఫిర్యాదుల్లో ఇవి ఏకంగా 8శాతం కావడం గమనించదగిన విషయం. దేశవ్యాప్తంగా NCRPకి వచ్చిన ఫిర్యాదుల్లో F.I.R నమోదులో దేశవ్యాప్త సగటు 2.5శాతంగా ఉంది. కాగా తెలంగాణాలో ఏకంగా 16శాతం వరకు ఉండటం కీలకంగా మారింది. ఆయా కేసుల్లో T.S.C.S.B ఏకంగా 133కోట్లను స్తంభింపజేసి దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే స్తంభింపజేసిన సొమ్ములోనుంచి సుమారు 7.71కోట్లను తిరిగి బాధితులకు ఇప్పించగలిగారు

Tags

Read MoreRead Less
Next Story