US Navy : ఇద్దరు చైనా గూఢచారులు అరెస్ట్

US Navy : ఇద్దరు చైనా గూఢచారులు అరెస్ట్
అమెరికా కీలక సైనిక సమాచారాన్ని చైనాకు చేరవేసినట్టుగా అనుమానం

చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారనే అనుమానంతో అమెరికా నౌకాదళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. యుద్ధనౌకలు, వాటి ఆయుధ వ్యవస్థల మాన్యువల్‌లు, రాడార్ సిస్టమ్ బ్లూప్రింట్‌లు ,భారీ యూఎస్ సైనిక వ్యాయామ ప్రణాళికల రహస్య సమాచారాన్ని ఈ ఉద్యోగులు బీజింగ్‌కు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులకు అమ్ముడిపోయి ద్రోహానికి పాల్పడిన వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


అమెరికా నౌకాదళంలో కీలక స్థావరాల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు చైనాకు ముఖ్యమైన సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో జించావ్‌ వీ అనే 22 ఏళ్ల వ్యక్తి... పసిఫిక్‌ మహాసముద్రంలోనే అమెరికాకున్న అతిపెద్ద నౌకాదళ స్థావరం శాన్‌ డియాగో నౌకాదళ కేంద్రంలో పనిచేస్తున్నాడు.ఇతడికి నౌక గురించి సున్నితమైన సమాచారం తెలుసుకొనేందుకు అనుమతులున్నాయి. అతడిని 2022 ఫిబ్రవరిలో మొదటిసారి చైనీస్‌ ఏజెంట్లు సంప్రదించారని అమెరికా అధికారులు చెబుతున్నారు. జించావ్‌ నుంచి నౌకకు చెందిన పలు ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలు, టెక్నికల్‌ మాన్యూవల్‌, బ్లూప్రింట్లు, ఆయుధ వ్యవస్థలు, నౌకపై నిలిపే విమానాలు, హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఏజెంట్లు తెప్పించుకొన్నారు. శిక్షణలో ఉన్న ఏజెంట్ సమాచారం కూడా అతను చైనా గూఢచారులకు అందజేసినట్లు తెలిసింది. చైనాలో జన్మించి అమెరికా పౌరసత్వం కోసం జించావ్‌ వీ దరఖాస్తు చేసుకున్నాడని అమెరికా అధికారులు తెలిపారు. ఇక మరో వ్యక్తి వెన్‌హెంగ్‌ ఝావో కాలిఫోర్నియాలో వెంచురా కౌంటీలో నౌకాదళ స్థావరంలో పనిచేస్తున్నాడు. థామస్‌ ఝావో అనే మారుపేరున్న ఇతనిని 2021లో చైనా ఏజెంట్లు సంప్రదించారు.. 15 వేల డాలర్లు చెల్లించి జపాన్‌లోని ఒకినావాలో ఉన్న అమెరికా సైనిక స్థావరంలోని రాడార్ల చిత్రాలు, డయాగ్రామ్‌లు, బ్లూప్రింట్లు, అమెరికా నౌకాదళ విన్యాసాల ప్రణాళికలు, ఆపరేషనల్‌ ఆర్డర్లు, ఎలక్ట్రికల్‌ వ్యవస్థల ఫోటోలు, వీడియోలు తెప్పించుకున్నట్లు సమాచారం .


గూఢచర్య ఆరోపణలపై వీరిద్దరిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. దీనిపై అమెరికా నౌకాదళాధికారులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. నేవీ లో పనిచేసే ఎవరైనా సరే డబ్బు కోసమో, ఇంకేదైనా కారణాలతో దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు ఇస్తే దానిని ద్రోహంగానే చూస్తామని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇలా అరెస్టైన ఇద్దరికీ పరస్పర సంబంధం ఉందా అనే విషయం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా కార్యాలయం నిరాధారమైనవిగా పేర్కొంది. అమెరికా ప్రభుత్వం, అక్కడి మీడియా చైనాకు సంబంధించిన గూఢచర్యం కేసులను కావాలని పెద్దవిగా చూపుతాయని విమర్శించింది.

Tags

Read MoreRead Less
Next Story