Omicron : బ్రిటన్‌ను వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. . ఆదివారం ఒక్కరోజే 10వేల కేసులు..!

Omicron : బ్రిటన్‌ను వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. . ఆదివారం ఒక్కరోజే 10వేల కేసులు..!
Omicron : ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి

Omicron : ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా భయం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ రూపంలో మళ్లీ వస్తుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు విస్తరించిన ఈ కొత్త వేరియంట్‌.. బ్రిటన్‌ను వణికిస్తోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 10వేల ఒమిక్రాన్‌ కేసులు రావడం బ్రిటన్‌ను కలవరపెడుతోంది. ఒమిక్రాన్‌ బాధితుల మరణాల సంఖ్య 12కు పెరిగింది. మరోవైపు, ఇప్పటికే కొన్ని దేశాలు ఒమిక్రాన్‌కు చెక్‌ పెట్టేందుకు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలుచేస్తున్నాయి.

డెల్టా వేరియంట్‌ కన్నా వేగంగా వ్యాపిస్తన్న ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు బ్రిటన్ సర్కార్ డిసెంబర్‌ 8న పలు ఆంక్షలు ప్రకటించింది. యూకే ప్రజలు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించడంతో పాటు మాస్కులు ధరించడం, వ్యాక్సిన్‌ పాస్‌లు ఉపయోగించడం వంటి నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఐతే కేసులు భారీగా పెరుగుతుండటం, 12మంది వరకు మరణించడం, మరో 102మంది వరకు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తరుణంలో కఠిన ఆంక్షలు విధించే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి నిబంధన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇళ్లలోనూ ప్రజలు మాస్క్‌లు ధరించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. క్రిస్మస్‌ సెలవుల్లో ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితుల్ని కలుసుకొనే అవకాశం ఉండటంతో మాస్క్‌ తప్పనిసరి నిబంధనను అమలు చేశారు. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు అమలులో ఉండనుంది.

క్రిస్మస్‌ కన్నా ముందే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం పౌరులను కోరింది. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించింది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో నెదర్లాండ్స్‌ కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. అత్యవసరం కాని దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లను జనవరి 14వరకు మూసిఉంచాలని నిర్ణయించింది. నార్వే కూడా లాక్‌డౌన్‌ తరహా నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించింది.

బార్‌లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరాను నిషేధించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కంపల్సరీ చేసింది. జర్మనీలో వ్యాక్సిన్‌ వేసుకోనివారిపై కఠిన ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story