UPI Payments: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ చెల్లింపులు షురూ

UPI Payments: శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ చెల్లింపులు షురూ
ప్రారంభించిన ముగ్గురు ప్రధానులు..

యూపీఐ సేవలలో మన దేశం అగ్రగామిగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు దేశం దాటి విదేశాలలో కూడా అమలవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో యూపీఐ సేవలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో భారతీయ పర్యాటకులు యూపీఐని వినియోగించి ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఇక ఇప్పుడు యూపీఐ సేవలు శ్రీలంక, మారిషస్‌ దేశాల్లో ప్రారంభమయ్యాయి. భారత, శ్రీలంక, మారిషస్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, రణిల్‌ విక్రమసింఘే, ప్రవింద్‌ జుగ్నాథ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రారంభించారు. గత ఏడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటన సందర్భంగా శ్రీలంకలో యూపీఐ సేవలకు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండుదేశాల్లో యూపీఐ సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మూడు దేశాలకు ఇది ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు.

ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని, భాగస్వామ్య దేశాలతో దేశ అభివృద్ధి అనుభవాలు, ఆవిష్కరణలను పంచుకోవడంపై ప్రధాని మోదీ బలమైన ప్రాధాన్యతనిచ్చారని ఎంఈఏ తెలిపింది. శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశం సంబంధాలను దృష్టిలో పెట్టుకొని దీనిని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రయోగం వేగవంతమైన, అతుకులు లేని డిజిటల్ లావాదేవీలను అందిస్తుందని.. దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందని చెప్పింది. తద్వారా విస్తృత వర్గానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.


మారిషస్‌లో యూపీఐ సేవల ప్రారంభంపై ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు.రూపేకార్డ్‌ను జాతీయ చెల్లింపుల స్విచ్‌తో కోబ్రాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. మారిషస్‌లో దేశీయ కార్డ్‌గా పరిగణించబడుతుందన్నారు. భారత్‌-మారిషస్ సాంస్కృతిక, వాణిజ్యంతో సంబంధాలను పంచుకుంటున్నాయన్నారు. ఇది శతాబ్దాలుగా ఉందని.. దాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్నామన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు. యూపీఐ సేవల ప్రారంభంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తుందన్నారు.

ఈ నెల ప్రారంభంలో, ఫ్రాన్స్ దేశంలో యూపీఐని పని చేయడానికి అనుమతించింది. భారతీయ పర్యాటకులు యూపీఐని ఉపయోగించి ఆన్‌లైన్‌లో టికెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఈఫిల్ టవర్‌కి తమ సందర్శనను బుక్ చేసుకోవచ్చు. యూపీఐని ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో పారిస్‌లో ఈ అధికారిక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపులను అందించిన మొదటి వ్యాపారిగా ఈఫిల్ టవర్ నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story