వచ్చేస్తోంది వెజ్ చికెన్

వచ్చేస్తోంది వెజ్ చికెన్
జంతు కణాలను ల్యాబ్ లో వృద్ధి చేయడం ద్వారా ఉత్పత్తి

అమెరికాలో ఇకపై కొత్త చికెన్ మార్కెట్లోకి రానుంది. చికెన్ కాని చికెన్.. ఏదో కోడి కాని కోడి పకోడీ లాగా అనుకోకండి. ఇది చికెనే కానీ కోడి నుంచి వచ్చింది కాదు. ల్యాబ్ లో తయారైంది. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించుకునేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్ డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది.

జంతు కణాలను ల్యాబ్ లో వృద్ధి చేయడం ద్వారా ఈ చికెన్ ను ఉత్పత్తి చేస్తారు. మొదటగా రెస్టారెంట్లలో వీటి అమ్మకాలు మొదలు పెట్టి, తర్వాత సూపర్ మార్కెట్లలోనూ దీనిని అందుబాటులో ఉంచనున్నారు. ఇకవేళ ఈ చికెన్ చాలా రుచిగా ఉండి, అందరికీ నచ్చితే ఇకపై జంతువులకు జరిగే హాని చాలా వరకు తగ్గినట్టే.

దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. జంతువుల పెంపకం, వాటికి దాణా, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పెద్ద పరిష్కారం లభిస్తుంది. ఈ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కోడి నుంచి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్‌ బ్యాంక్‌ రూపొందించడంతో మొదలవుతుంది. ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా ఇక్కడ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. దీనిని సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ అని అంటారు. ఇలా కృత్రిమంగా పండిస్తున్న కోడి మాంసం తినడం ఎంతో సురక్షితమని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ అంగీకరించింది. ఈట్ జస్ట్ కంపెనీ, జోనిన్ బయోలాజిక్స్ అనే కంపెనీలు త్వరలో అమెరికాలో ఈ చికెన్ను అమ్మకాలకు అనుమతులు పొందాయి. కృత్రిమంగా తయారు చేసిన చికెన్ ను ఈట్ జస్ట్ కంపెనీ గుడ్ మీట్ అనే పేరుతో ఇప్పటికే సింగపూర్ లో విక్రయిస్తోంది. ల్యాబ్ గ్రోన్ చికెన్ ను అనుమతించిన తొలి దేశం అదే కావడం విశేషం.

కణం నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కల్చర్డ్‌ చికెన్‌లో ఒక్క చుక్క కూడా యాంటీబయాటిక్స్‌ ఉపయోగించవలసిన అవసరం లేదని సంస్థలు చెబుతున్నాయి. తగినంత కొవ్వుతో పాటు కావాలసిన స్థాయిలో ప్రొటీన్స్, విటమిన్స్‌ ఈ కృత్రిమ మాంసంలో ఉంచే అవకాశం ఉంది.

పూర్తిగా బోన్‌లెస్‌ చికెన్‌ మాదిరిగా ఉండే ఈ చికెన్‌ శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఈ చికెన్ మార్కెట్ లోకి వస్తే మాంసాహారం కోసం జీవాలను చంపే ముప్పు తప్పుతుంది. దాని వల్ల కలిగే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. , భవిష్యత్‌లో మిగిలిన మాంసాహార ఉత్పత్తుల్ని కూడా ఇదే తరహాలో తయారు చేసే అవకాశాలు లేకపోలేదు.

Tags

Read MoreRead Less
Next Story