USA: అమెరికాలో రౌడీ పోలీస్‌

USA: అమెరికాలో రౌడీ పోలీస్‌
భర్త అరెస్ట్‌ను వీడియో తీసిందని మహిళను కిందపడేసి పెప్పర్ స్ప్రే చేసిన ఉదంతం

భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో తొక్కి దాడి చేశారు. కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.

అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. గ్రాసరీ కోసం ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్‌ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ సామాను కొనుగోలు చేసి బయటికి వస్తుండగా సూపర్‌ మార్కెట్‌ సిబ్బంది వాళ్లను అడ్డగించారు. కొన్ని వస్తువులను బిల్లింగ్‌ చేయించకుండా తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫోన్‌ చేశారు. దాంతో పోలీసులు వచ్చి బాధితురాలి భర్తను బయటికి ఈడ్చుకెళ్లారు. అయితే తాము ఏం నేరం చేయలేదని, తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆ మహిళ అరెస్ట్ ను మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసింది. ఇది చూసిన ఓ పోలీస్ మండిపోయాడు. ఆమె చేతి నుంచి మొబైల్ లాక్కుని, నేలపైకి తోసేశాడు. అక్కడితో ఆగకుండా ఆమెను మోకాలితో తొక్కిపట్టి, కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు .

కళ్లముందే తన భార్య పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న పోలీసులను ఆ భర్త వేడుకున్నాడు. తన భార్యను ఏం చేయొద్దని, ఆమె క్యాన్సర్ తో బాధపడుతుందని చెప్పాడు. ఆఖరి ఆమె చేతులకు కూడా పోలీసు సంకెళ్లు వేశాడు. భార్యభర్తలు దొంగతనం కేసులో బుక్‌ చేశారు.

ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడ ఉన్న వారు ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇదెక్కడి దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులు ఓ ప్రకటిన విడుదల చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులను విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించారు.




2020లో మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఓ పోలీస్ దాడి చేసి మెడపై మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక అతను మరణించారు. ఈ ఘటన యూఎస్ లో సంచలనంగా మారింది. ఫ్లాయిడ్ మరణానికి జాతి వివక్ష కారణం అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం కోల్పోవడానికి కూడా ఇది ఓ కారణమైంది.

Tags

Read MoreRead Less
Next Story