అధ్యక్షుడిగా రేపు జో బైడెన్‌ ప్రమాణస్వీకారం.. పటిష్ఠ పహారాలో అమెరికా

అధ్యక్షుడిగా రేపు జో బైడెన్‌ ప్రమాణస్వీకారం.. పటిష్ఠ పహారాలో అమెరికా
ప్రమాణ స్వీకారం రోజున దాడులకు దిగే అవకాశం.. భద్రతా సిబ్బంది నుంచే ముప్పు అంటూ హెచ్చరికలు..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

అమెరికాలో కొత్త అధ్యక్షుడు కొలువుదీరే సమయం దగ్గర పడుతోంది. దీంతో క్షణ క్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఓవైపు ట్రంప్‌ మొన్నటి వరకు అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు ససేమిరా అనడం.. ఆ తరువాత అల్లర్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లర్లు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో.. ఈ తరుణంలో రాజధాని వాషింగ్టన్​ డి.సి ప్రాంతం.. పూర్తిగా మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భద్రతా బలగాల్లోని వారే నిరసనలకు ఉసిగొల్పే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దళాల్లో ప్రతి సభ్యుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్​ భవనం సహా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

మరోవైపు అధికార పీఠం నుంచి దిగిపోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. కొత్త అధ్యక్షుడు బైడెన్‌కు ఎదురుపడేందుకు ససేమిరా అంటున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకావట్లేదు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టక ముందే వాషింగ్టన్‌ను వీడుతున్నారు. దీంతో బైడెన్‌ ప్రమాణస్వీకారం కంటే ముందే ట్రంప్‌కు వీడ్కోలు పలికేందుకు వైట్‌హౌస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్టోంది. రేపు ఉదయం 8 గంటలకు వాషింగ్టన్‌ డీసీ బయట ఉన్న జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి అటే ఆయన ఫ్లోరిడాకు వెళ్లిపోనున్నారు. మధ్యాహ్నం సమయంలో బైడెన్‌ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

కొత్త అధ్యక్షుడిగా కొలువుతీరుతున్న జో బైడెన్‌ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్‌ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్‌ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్‌ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. బైడెన్‌ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్‌ మూలాలున్న కమలా హ్యారిస్‌ గతంలోనే ఎన్నికయ్యారు. రేపు దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story