Australia: : అమెరికా సైనిక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి

Australia: : అమెరికా సైనిక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి
20 మందికి గాయాలు

ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యుద్ధ విన్యాసాల్లో అమెరికాకు చెందిన ఓ సైనిక హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మెరైన్స్ మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రిడేటర్ రన్ పేరుతో యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఈస్ట్ తైమూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాకు చెందిన దాదాపు 2500 సైనికులు ఈ విన్యాసాల్లో పాల్ల్గొంటున్నారు.

ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం అమెరికా మెరైన్ విభాగానికి చెందిన ఎంవీ-22బీ ఓస్ర్పేకు చెందిన రెండు హెలికాప్టర్లు ఆస్ట్రేలియాలోని ఉత్తర డార్విన్ నుంచి 80 కిలో మీటర్లు దూరంలోకి తివి ద్వీపానికి బయలుదేరాయి.


ఈ క్రమంలోనే 23 మందితో వెళ్తున్న ఓ సైనిక విమానం మాల్విల్ ద్వీపం వద్ద ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మెరైన్స్ ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శకలాలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు డార్విన్ రొటేషన్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అప్రమత్తమైన అక్కడి పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ సంఘటనను విషాదకరమైనదిగా పేర్కొన్నారు. ధైర్యవంతులను కోల్పోయినందుకు దేశం దుఃఖంలో మునిగిపోయిందన్నారు. రాను రాను బల పడుతున్న చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. ఇందులో భాగంగానే తన మిత్ర దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. అయితే గత నెలలో కూడా ఇదే రకం హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. అప్పుడు నలుగురు సైనికులు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story