Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీల క్షిపణిని కూల్చేసిన అమెరికా

Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీల క్షిపణిని కూల్చేసిన  అమెరికా
యెమెన్‌‌లో రెచ్చిపోతున్నహౌతీ తిరుగుబాటుదారులు

హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో ప్రయోగించిన క్షిపణిని తమ యుద్ధనౌక సాయంతో కూల్చివేసినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. ఇరాన్ మద్దతున్న హౌతీలు గత రెండు నెలలుగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. కీలకమైన సముద్ర వాణిజ్య మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకునే హౌతీల సామర్థ్యాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా, బ్రిటీష్ దళాలు రెండు రౌండ్ల సంయుక్త దాడులను నిర్వహించాయి. అమెరికా వైమానిక దాడులను కూడా ప్రారంభించింది. కానీ, హౌతీలు మాత్రం తగ్గడం లేదు. తమ దాడులను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

‘ఇరాన్ మద్దతుగల హౌతీ మిలిటెంట్లు యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని అర్లీ-బుర్కే క్లాస్ డిస్ట్రాయర్ USS కార్నీ (DDG 64) వైపు ఒక యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు’ అని US సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపింది. USS కార్నీ ఆ క్షిపణిని విజయవంతంగా కూల్చివేసిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా నష్టం జరగలేదని తెలిపింది.

గత నవంబరు నుంచి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. హమాస్‌‌తో యుద్ధం చేస్తోన్న ఇజ్రాయేల్‌కు మద్దతిస్తోన్న దేశాలకు చెందిన నౌకలపై దాడికి పాల్పడుతున్నాయి. అమెరికా, బ్రిటిష్ ప్రయోజనాలను కూడా చట్టబద్ధమైన లక్ష్యాలుగా యెమెన్ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

సైనిక చర్యతో పాటు హౌతీలపై దౌత్యపరమైన, ఆర్థిక ఒత్తిడిని తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోంది, అధ్యక్షుడు జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే హౌతీలను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించగా.. తాజా దాడులతో గత వారం వారిని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story