అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన బైడెన్‌.. ట్రంప్‌ శ్వేతసౌధం ఖాళీ చేస్తారా?

అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన బైడెన్‌.. ట్రంప్‌ శ్వేతసౌధం ఖాళీ చేస్తారా?

అగ్రరాజ్య అధినేతగా జో బైడెన్‌కు అమెరికా ఓటర్లు పట్టం కట్టారు.. మరి తరువాత ఏం జరగబోతోంది..? అధికార బదాలయింపు అంతా ఈజీ కాదా..? జనవరి 20 వరకు అద్యక్ష బాద్యతలు చేపట్టేందుకు బైడెన్‌ ఎందుకు ఎదురుచూడాలి..? ఇప్పటికే ఫలితాలపైనే ఇంతగా గోల చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని ఖాళీ చేస్తారా..? అధికార మార్పిడికి సహకరిస్తారా..? దానికి కూడా అడ్డంకులు సృష్టిస్తారా? అనేవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు..

అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ నెగ్గినా.. శ్వేతసౌధంలో కాలుమోపం అంత ఈజీ కాదు. ఈ అధికార బదలాయింపు ఓ సుదీర్ఘ ప్రక్రియ. ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగడంతో.. ఈ బదలాయింపు సైతం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రస్తుత అధ్యక్షుడు హుందాగా తప్పుకోవాలి.. కానీ ట్రంప్‌ అందుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో కోర్టు కేసులు అధికంగానే ఉన్నాయి. పోలింగ్‌లో అవకతవకలు.. డేటు ముగిసిన తరువాత ఓట్లు వేశారని చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్లు కోర్టుకెక్కారు. అయితే సరైన సాక్ష్యాధారాలు చూపించ లేదంటూ స్థానిక కోర్టులు కేసులు కొట్టేశాయి. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు రిపబ్లికన్లు సిద్ధమయ్యారు.

అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునేది ఎలక్టోరల్‌ కాలేజీ అన్నది తెలిసిందే. ఒకసారి ఎలక్టర్‌గా నియమితులయ్యాక వీరు తమ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యకపోయినా, ఓటు రద్దు చేసినా ఇబ్బందే. అలాంటివారిని ''అవిధేయులు'' అని తీర్మానిస్తారు. వారి స్థానంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ కొత్త వారిని నియమించవచ్చు. పాపులర్‌ ఓటు ఎంత ఎక్కువ ఉన్నా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లే అధ్యక్షుడవడానికి కీలకం. ఈసారి అవిధేయ ఎలక్టర్స్‌ ముప్పు ఏమైనా ఉంటుందా... అన్న గుబులు బైడెన్‌ శిబిరంలో ఉంది. కాగా- ప్రతీ రాష్ట్రంలోని ఎలక్టర్స్‌ డిసెంబరు 14న సమావేశమవుతారు. వారి జాబితాను అక్కడి గవర్నర్‌ ధ్రువీకరించి- కాంగ్రెస్‌కు పంపుతారు. కానీ అమెరికా అధ్యక్ష ఫలితాల అంతిమ ప్రకటనలతో సంబంధం లేకుండానే... అధికార బదిలీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నాలుగేళ్ళ కొత్త ప్రభుత్వ పాలనకు... రంగం సిద్ధమవుతోంది. ట్రంప్‌, బైడెన్‌లతో సంబంధం లేకుండానే.. ఈ కసరత్తు జరుగుతోంది. ట్రంప్‌ మరీ మొండిగా వ్యవహరిస్తే.. అతడ్ని తప్పించి ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందనే అనుకుంటున్నారు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం- కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటిదాకా ట్రంపే అధికారంలో ఉంటారు. కానీ.. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తన ప్రభుత్వ కూర్పు కసరత్తు మొదలెట్టేస్తారు! అందుకు వీలు కల్పించేలా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కేటాయిస్తారు. ఈ పనులన్నీ రాజ్యాంగబద్ధంగా కొన్ని నెలల కిందటినుంచే మొదలయ్యాయి. ఇందుకోసం అమెరికా రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఈసారి ఎన్నికల్లో బైడెన్‌ నెగ్గినట్లు ప్రకటించగానే.. ఆయనకు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలిక కార్యాలయం, సిబ్బంది సదుపాయాలు కల్పిస్తారు. దీంతో జనవరి 20లోపు వారు తమ ప్రభుత్వంలోని వివిధ పదవుల కూర్పుపై కసరత్తు చేసుకోవటానికి వెసులుబాటు లభిస్తుంది. అంటే ప్రమాణ స్వీకారం నాటికి దాదాపు 70 రోజుల సమయం వారికి అందుబాటులో ఉంటుంది.

విదేశాంగ, రక్షణ మంత్రిత్వలాంటి కీలక శాఖలతోపాటు ప్రభుత్వంలోని సుమారు 4వేల పదవులను భర్తీ చేయటానికి, ప్రణాళికలకు ఈ సమయాన్ని కొత్తగా ఎన్నికైన వారు వాడుకుంటారు. ఈ 4వేల పదవుల్లో దాదాపు వెయ్యింటిని సెనెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఫలితాలు తొందరగా తేలితే కొత్త అధ్యక్షుడికి కసరత్తుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. విజయం దిశగా అడుగులు వేస్తున్నామని తెలియగానే... బైడెన్‌ వర్గం కొత్త ప్రభుత్వ కూర్పుపై కసరత్తు మొదలెట్టింది. మరోవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే... బైడెన్‌ సన్నిహితుడు, నమ్మకస్తుడైన టెడ్‌ కాఫ్‌మన్‌ ఈ పనిలో నిమగ్నమైపోయారు.

2008లో ఒబామా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా కాఫ్‌మన్‌ అధికార బదిలీలో కీలక పాత్ర పోషించారు. బైడెన్‌ చేసే నియామకాలకు సెనెట్‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది కాబట్టి... ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే... సెనెట్‌లో ఈసారి రిపబ్లికన్‌లకు బలం చేకూరేలా ఉంది. మామూలుగానైతే.. ఫలితాలు వెలువడగానే అధ్యక్షుడు వెళ్ళి కొత్తగా ఎన్నికైన వారిని అభినందించటం సంప్రదాయం. 2016లో ఒబామా అలాగే వెళ్ళి ట్రంప్‌ను కలిశారు. కానీ ఈసారి నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ట్రంప్‌-బైడెన్‌ల మధ్య ఆ సంప్రదాయం కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది..

Tags

Read MoreRead Less
Next Story