అంతర్జాతీయం

అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. నిమిషానికి ఒకరు బలి!

అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నిమిషానికి ఒకరు వైరస్‌తో మరణిస్తున్నారు. ఇప్పటికి 2.5 లక్షల మందికి పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది..

అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. నిమిషానికి ఒకరు బలి!
X

అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నిమిషానికి ఒకరు వైరస్‌తో మరణిస్తున్నారు. ఇప్పటికి 2.5 లక్షల మందికి పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ 45.71లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి. రోజూ రికార్డుస్థాయిలో కరోనా బాధితులు వస్తుండటంతో ఆక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సరిపడినంత స్థాయిలో బెడ్లు లేక.. ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, విశ్రాంతి సముదాయాలు సహా వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ పడకలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సరిపడా వైద్య సిబ్బంది లేక బాధితులు అవస్థపడుతున్నారు. రెండు, మూడు వారాల క్రితం.. రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ బుధవారం ఒక్కరోజే 1.55 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజాగా 24 గంటల్లో 1700 మరణాలు సంభవిస్తే.. రెండు నుంచి మూడు వారాలు గడిచేటప్పటికి రోజుకు సుమారు 3 వేల మంది మృతిచెందవచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 13 లక్షల మందికి పైగా మృతి చెందారు.

ఆఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ ఖండంలోని 54 దేశాల్లో 48 వేల మందికి పైగా కొవిడ్‌తో మరణించారు. గల్ఫ్‌ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో కొత్తగా నమోదైన కేసుల్లో 60 శాతానికి పైగా ఇరాన్‌లోనే వెలుగుచూసినట్లు తెలిపింది. జోర్టాన్, మొరాకో, లెబనాన్, ట్యునీసియాల్లోనూ ఒకే రోజు సంభవించిన మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది.

15 దేశాల్లో ఇప్పటివరకు అధికారికంగా నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే.. మార్చి నుంచి ఆగస్టు నెలల్లో సగటున ఆరు రెట్లు అదనంగా కరోనా వ్యాప్తి జరిగిందని ఆస్ట్రేలియా పరిశోధకులు ఓ అధ్యయనంలో తెలిపారు. ఇటలీలో ఈ ప్రభావం 17 రెట్లు, ఆస్ట్రేలియాలో 5 రెట్లు అదనంగా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికా సహా 11 ఐరోపా దేశాల్లో సుమారు 80 కోట్ల మంది ప్రజలపై ఈ అధ్యయనం చేశారు.

Next Story

RELATED STORIES