అధ్యక్షుడిగా తప్పుకున్నాక ట్రంప్‌కు వచ్చే పింఛను ఎంతో తెలుసా?

అధ్యక్షుడిగా తప్పుకున్నాక ట్రంప్‌కు వచ్చే పింఛను ఎంతో తెలుసా?

అగ్రరాజ్యం అధినేతగా జో బైడెన్‌కు అమెరికా జేజేలు పలికింది.. క్షణ క్షణం మలుపులు.. ట్విస్ట్‌లపై ట్విస్టులు.. కోర్టు కేసులతో నాలుగు రోజులు పాటు నెలకొన్న ఉత్కంఠ వీడింది. దోబూచులాడిన విజయం డెమొక్రాట్లనే వరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంపే అధికారంలో ఉంటారు. అయితే కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కేటాయిస్తారు. ఈసారి ఎన్నికల్లో బైడెన్‌ నెగ్గినట్లు ప్రకటించగానే.. ఆయనకు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలిక కార్యాలయం, సిబ్బంది సదుపాయాలు కల్పిస్తారు. దీంతో జనవరి 20లోపు వారు తమ ప్రభుత్వంలోని వివిధ పదవుల కూర్పుపై కసరత్తు చేసుకోవటానికి వెసులుబాటు లభిస్తుంది.

మాజీ అధ్యక్షులకు కూడా ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. దేశానికి సేవలందించినందుకు గానూ వీరికి ప్రభుత్వం పింఛను ఇస్తుంది. ప్రతి ఏడాదికి 2,19,200డాలర్లు (దాదాపు రూ.1.6కోట్లు) పింఛను సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ మంజూరు చేస్తుంది. ఇది ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో ఉద్యోగుల జీతంతో సమానం. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పింఛను మొత్తంలో మార్పులు జరుగుతాయి. మాజీ అధ్యక్షుడి భార్యకు కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు. అటు అధ్యక్ష పీఠం నుంచి తప్పుకుని వైట్ హౌజ్ వీడాక 7 నెలల పాటు వారు వ్యక్తిగత ఆఫీస్ ఏర్పాటు చేసుకునేందుకు, అద్దె, టెలిఫోన్, ప్రింటింగ్, పోస్టల్ ఖర్చులకు నిధులను సర్కార్ ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story