Israel-Hamas: యుద్ధాన్ని మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే

Israel-Hamas: యుద్ధాన్ని  మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే
దేశప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగం

తాము యుద్ధాన్ని కోరుకోలేదు, మొదలు పెట్టలేదు కానీ, తామే ముగిస్తామని ఇజ్రాయేల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయేల్‌పై దాడిచేసి ఘోరమైన చారిత్రక తప్పిదానికి పాల్పడ్డామని హమాస్‌కు సుదీర్ఘ కాలం పాటు గుర్తుండిపోయేలా చేస్తామని వ్యాఖ్యానించారు. యుద్ధం నేపథ్యంలో సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన బెంజిమిన్ నెతన్యాహు.. ‘‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది.. దీన్ని మేం ఏ మాత్రం కోరుకోలేదు.. కానీ, తప్పని పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఆయుధం పట్టాల్సి వస్తోంది. మేం దీన్ని మొదలుపెట్టాలని భావించలేదు. కానీ, ముగించేది మాత్రం ఇజ్రాయేలే’’ అని నెతన్యాహు ఉద్ఘాటించారు.

హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు పేర్కొన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. ‘అమాయక ఇజ్రాయేలీలపై హమాస్ చేసిన క్రూరమైన దాడులు తన మనసును కదిలించాయన్నారు. కుటుంబసభ్యులను కళ్లెదుటే ఇళ్లలో వధించడం.. వేడుకలో వందలాది మంది యువకులను ఊచకోత కోయడం అనేక మంది మహిళలు, పిల్లలు, వృద్ధులను అపహరించడం. హమాస్ ఉగ్రవాదులు పిల్లలను బంధించి, కాల్చి చంపినవారికి కనీసం మానవత్వం లేదని నెతన్యాహు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ సందర్భంగా నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో ఇప్పటి వరకూ 1,600 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఇక, హమాస్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇజ్రాయేల్ 3,00,000 మంది సైనికులను సమీకరించింది. 1973 యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ఇజ్రాయేల్ సైన్యాలను మోహరించడం ఇదే మొదటిసారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. అప్పటి యుద్ధంలో ఏకంగా 4 లక్షల మంది సైన్యాలను మోహరించింది.

మరోవైపు, గాజాలోని ప్రజలను ఇజ్రాయేల్ లక్ష్యంగా చేసుకుంటే తమ వద్ద బందీలుగా ఉన్నవారిని ఎటువంటి హెచ్చరికలు లేకుండా తలల నరికి.. ఆ హత్యలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని హమాస్ బెదరింపులకు పాల్పడింది. ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులతో సహా 100 మందికి పైగా బందీలు తమ వద్ద ఉన్నట్టు హమాస్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story