Covid variant :మూడు దేశాల్లో కొవిడ్ కొత్త వేరియెంట్

Covid variant :మూడు దేశాల్లో కొవిడ్ కొత్త  వేరియెంట్
పర్యవేక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

అంతా ప్రశాంతగా గడుస్తోంది అని అనుకుంటున్నావేళ ప్రపంచంలోని మూడు దేశాల్లో కొవిడ్ ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కొవిడ్-19కి కారణమయ్యే కొత్త వైరస్ వంశాన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కొత్త రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది.అయితే ఇది మునుపటి కంటే అధికంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, ఇజ్రాయెల్‌ దేశాల్లో ప్రబలుతున్న ఈ కొత్త సబ్ వేరియెంట్ కు బీఏ.2.86 అని పేరు పెట్టారు. ( Covid variant BA.2.86) ఈ కొత్త వేరియెంట్ పర్యవేక్షిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విట్టరులో పేర్కొంది.

ప్రస్తుతం ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న ఎక్స్‌బీబీ .1.5 కొవిడ్ వేరియంట్ లో 36 ఉత్పరివర్తనలు ఉన్నాయని, ఈ రకానికి చెందిన సీక్వెన్స్ లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని చెబుతున్నారు. ప్రస్తుతం మూడు వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌లను ట్రాకింగ్ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.


కరోనావైరస్ అంత బలమైనది కాకపోయినా.. ప్రపంచానికి ఇదొక ముప్పేనని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసస్ తెలిపారు. కొత్తగా గుర్తించిన బీఏ.2.86 వేరియంట్ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. గుజరాత్‌లో జరుగుతోన్న జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సమాచారం అందించారు. కొత్తగా వెలుగుచూస్తున్న వేరియంట్లలో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయన్నారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇలాంటి కొత్త వేరియంట్లు గుర్తు చేస్తున్నాయని చెప్పారు.

మరోవైపు ఈజీ-5 అనే కొత్త వేరియంట్ అన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని, ఒమిక్రాన్ ఉత్పరివర్తన అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ ఓ ప్రస్తుతం ఇలా ఒక 10 వేరియంట్లను పర్యవేక్షిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story