- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- హెచ్చరిక.. నరకం అనుభవిస్తున్న జనం.....
హెచ్చరిక.. నరకం అనుభవిస్తున్న జనం.. రైతులు జాగ్రత్తగా ఉండాలి..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీనికి తోడు వాయువ్యం నుంచి వడగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అగ్ని గుండంగా మారింది. ఈ నెల 25న మంచిర్యాల నీల్వాయిలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 26న 47.8 డిగ్రీలు నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. 26న ప్రపంచంలోనే అత్యధికంగా కువైట్‌లోని మిత్రిబాలో 47.6 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డయింది. అయితే నీల్వాయిలో దీనికంటే 0.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. నీల్వాయితో పాటు ఎండపల్లి, రాజారామ్‌పల్లి, ధర్మపురిలో 47.7 డిగ్రీలు, జైన, మెట్‌పల్లిలో 47. 5 డిగ్రీలు, కొల్వాయి, పొలాస, సారంగపూర్‌లో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక థార్ ఎడారిని మించి హైదరాబాద్‌లో ఎండలు కొడ్తున్నాయి. మే 26న థార్‌లో 43.3 డిగ్రీలు కాగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రేణిగుంటలో అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలో మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో జనం బయటకు రావడానికి భయపడ్తున్నారు. మరోవైపు ఎండలు వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేలలో తేమ శాతం పూర్తిగా ఎండి పోతున్నందున వరికి తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చంటున్నారు. పంట మార్పిడి విధానాలు పాటించాలని సూచిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు గతేడాది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి. జూన్ నెల వస్తున్నా రుతుపవనాలు కేరళను ఎప్పుడు తాకుతాయో తెలియడం లేదు. ఇది వాతావరణ నిపుణులను కలవర పెడ్తోంది. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకశముందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com