- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ 27వ రాజ్యాంగ సవరణ ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.
ఈ రాజ్యాంగ సవరణ ఆర్మీ చీఫ్‌ను దేశ రక్షణ దళాల అధిపతిగా మారుస్తుంది. ఆ పదవిని మునీర్‌కే కట్టబెడతారన్నది అందరూ ఊహిస్తున్న విషయమే. అదే జరిగితే అతనికి సైన్యం, నేవీ, వైమానిక దళంపై ఏకపక్ష ఆధిపత్యాన్ని కల్పిస్తుంది. ఒక విధంగా దేశానికి ఆయనే సర్వాధికారి. అంతేకాకుండా ఈ రాజ్యాంగ సవరణతో పౌర పర్యవేక్షణ చివరి పొరను కూడా నిర్వీర్యం చేస్తుంది. పెళుసైన ప్రజాస్వామ్యాన్ని ఫీల్డ్ మార్షల్ దేశంగా మారుస్తుంది.

కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం తుపాను కారణంగా సుమారు 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. 5.6 లక్షల మంది గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు.

మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మిచొకాన్‌లో ఆమె మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ క్లాడియా ప్రజలతో మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి వేస్తూ.. ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ.. అతడి చేతిని పక్కకు నెట్టారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా బుధవారం తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇండోనేషియా ని మరోసారి భారీ భూకంపం వణికించింది. సులవేసి ద్వీపం లో బుధవారం ఉదయం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఈ భూకంపం ధాటికి ఉత్తర తీరంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిసింది. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వారం రోజుల్లో ఇండోనేషియాలో భూమి కంపించడం ఇది రెండోసారి. గతవారం మలుకు దీవుల సమీపంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా బుధవారం కూడా మరోసారి అదే స్థాయిలో భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోగా, 30 మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్‌వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్- బాలానగర్‌లోని MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. MTAR కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్‌ను 30% నుంచి 50% కు పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MTAR కంపెనీ BRTU యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ డీజీపీ కఠిన చర్యలు తీసుకున్నారు. వాహన డ్రైవర్ల నుంచి లంచాలు తీసుకుంటూ దొరికిన 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాజీవ్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వేర్వేరు జిల్లాలో వాహన డ్రైవర్ల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో వాటి ఆధారంగా డీజీపీ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా 11 మందిని సస్పెండ్ చేశారు. చిత్రకూట్, బందా, కౌషాంబి జిల్లాల్లో పలు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసు శాఖ స్టేట్మెంట్ ప్రకారం సస్పెండ్ అయిన వారిలో ఓ ఇన్‌స్పెక్టర్, ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు సబ్ సబ్ఇన్‌స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత.. మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే .. మీ జీతంలో 10 నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుందో.. అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్లో ఒకటో తేదీన పడుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం’’ అని సీఎం అన్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్.. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు అలసత్వం వీడి అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు. సొంత నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతమవుతాయని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ‘‘కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలి. ఇకపై సీఎస్, సీఎంవో అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలి’’ అని ఆదేశించారు.

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని సెయింట్ హెలినా దీవిలో తెల్లవారుజామున ఓ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. విల్లీస్ బార్ అండ్ గ్రిల్‌లో ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో జనాలు ఉండటం గమనించిన దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తుపాకీ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది సమీపంలోని షెల్టర్లు, షాపుల్లోకి పరిగెత్తారని వివరించారు.

అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.
తొమ్మిదేండ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ విజేతగా నిలిచిన తర్వాత ‘ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని నేను ప్రపంచానికి చూపాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తనను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్‌స్టాలో 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. లేలాండ్ పట్టణంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ ఈ ఘటనను ధృవీకరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అక్కడ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు.
మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర మేయర్ జాన్‌లీ ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ తెలిపింది.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూల అమ్మకం కలకలం రేపింది. తేమ సరిగా ఆరకుండానే బూజు పట్టిన లడ్డూలను సిబ్బంది అమ్ముతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. లడ్డూలు తీసుకొచ్చే ట్రేల నుంచి దుర్వాసన వస్తోందని మండిపడుతున్నారు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని ఇలా విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రసాదాల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత్‌కు అంబాసిడర్‌గా సెర్గియా గోర్(Sergio Gor)ను కన్ఫర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగళవారం 38 ఏళ్ల గోర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేటర్లు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉన్నా.. భారత్‌కు సెర్గియో గోర్‌ను అంబాసిడర్‌గా అమెరికా నియమించింది. దక్షిణాసియా దేశాల వ్యవహారాల శాఖ మంత్రిగా పౌల్ కపూర్‌ను నామినేట్ చేశారు. సింగపూర్‌కు అంజనీ సిన్హాను అంబాసిడర్‌గా అమెరికా ప్రకటించింది.
అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశం వల్ల ప్రాంతీయ ప్రాబల్యం పెరుగుతందన్నారు. భారత్‌తో భాగస్వామ్యం నేపథ్యంలో అమెరికా ప్రయోజనాల గురించి వివరించనున్నట్లు చెప్పారు. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య సంబంధాల వల్ల అమెరికా పోటీతత్వం పెరుగుతోందని, ఇతర దేశాలపై చైనా ఆర్థిక ప్రభావం కూడా తగ్గుతుందని గోర్ తెలిపారు.
ప్రాంతీయ స్థిరత్వం, భద్రత అంశాల్లో భారత పాత్రను విస్మరించలేమని ఆయన అన్నారు. దక్షిణాసియా ప్రాంతం స్థిరంగా ఉండాలన్నది అమెరికా ఆకాంక్ష అని తెలిపారు.

పండగ పూట తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెలవుల నేపథ్యంలో యువకులు చెన్నై నుండి మున్నార్ ట్రిప్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని జాతీయ రహదారిపై కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు ఇద్దరు యువకులు బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు.

మయన్మార్‌లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు నాగాలాండ్, అస్సాంలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 15 కిలోమీట్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, సోమవారం అర్ధరాత్రి 12.09 గంటల సమయంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.4గా ఉందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఇక టిబెట్‌లో కూడా మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. ఉదయం 4.28 గంటలకు 3.3 తీవ్రత ప్రకంపణలు వచ్చాయి. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు 303 కిలోమీటర్లు, అరుణచల్ ప్రదేశ్‌లోని పంగిన్‌కు 227 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నదని పేర్కొంది.

ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ర్టాలు టాప్ పొజిషన్‌లో నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో 23.18 కోట్ల కేసుల ఐఎంఎఫ్‌ఎల్ అమ్ముడుపోయింది. అంటే దేశంలో జరిగిన అమ్మకాల్లో 58 శాతం ఇక్కడే జరిగాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్‌ఎల్ అమ్మకాల్లో దక్షిణాది ఆధిపత్యం దాదాపు పరిపూర్ణంగా ఉంది. 58 శాతం అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి. మిగిలిన 42 శాతం దేశంలోని ఇతర రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నది. అయితే, కర్ణాటకలో 6.88 కోట్ల కేసులు అమ్ముడుపోవడంతో ఆ రాష్ట్రం ఈ చార్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 6.47 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. విజయవాడ హాట్ సిటీ.. కూల్ పీపుల్. ఇది అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా మారాలి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ పర్యటనను నా జీవితంలో మరిచిపోలేను. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి.. జై ఆంధ్రప్రదేశ్’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రారంభంలో అందరికీ “తెలుగు భాషలో నమస్కారం” చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.

అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్.. డంకన్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ఈ విషయాన్ని పరిష్కరించాలని టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేశారు.
2024లో టెక్సాస్‌లో హనమాను విగ్రహం ఏర్పాటు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కరించారు. యూఎస్‌లో ఎత్తైన హిందూ స్మారక చిహ్నాలలో ఇదొకటి. అమెరికాలోనే మూడో ఎత్తైన విగ్రహం ఇదే. 90 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు.
నిరీక్షణకు తెరపడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) అధికారిక ట్రైలర్ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుండి వ్యూస్ మరియు లైకుల వర్షంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం ఒక ట్రైలర్ కాదు, సెప్టెంబర్ 27న థియేటర్లలో ఎలాంటి అగ్నిపర్వతం బద్దలు కాబోతోందో చూపించే ఒక చిన్న శాంపిల్ మాత్రమే.
యువ దర్శకుడు సుజీత్ తన మేకింగ్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పడానికి ఈ ట్రైలరే నిదర్శనం. ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా చెక్కాడు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌లోని అసలైన ఫైర్‌ను, ఆయన కళ్ళలోని తీవ్రతను సుజీత్ అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడు. ముంబై అండర్‌వరల్డ్‌ను జపాన్‌లోని యాకుజా (Yakuza) కల్చర్‌తో మిక్స్ చేసి, కథకు ఒక ఇంటర్నేషనల్ ఫీల్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చేతిలో కటానా పట్టుకుని నడుస్తుంటే, అది కేవలం ఒక స్టైల్ స్టేట్‌మెంట్ కాదు, తన పాత్ర యొక్క క్రూరత్వాన్ని, శక్తిని ప్రతిబింబిస్తుంది
సుజీత్ దర్శకత్వ ప్రతిభ, పవన్ కళ్యాణ్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, మరియు వినూత్నమైన కథాంశం కలగలిపి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో ‘ఓజీ’ సృష్టించబోయే ప్రభంజనం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశారు. కార్గో షిప్ సోమాలియాలోని బోసాసోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. డీజిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. అయితే ప్రమాదం జరగగానే ఓడరేవు నుంచి కిలోమీటర్ దూరంలోకి లాక్కెళ్లారు. అనంతరం 100 కి.మీ సముద్రంలోకి తీసుకెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్స్ సహకారంతో మంటలను అదుపు చేశారు. నౌకలో మంటలు అంటుకోగానే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దీన్ని చూసేందుకు సమీపంలోని స్థానికులు బీచ్ దగ్గరకు వచ్చి వీక్షించారు.

బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యమేనని (Indian Army) సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రాంచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. దేశసేవ చేయాలంటే సైన్యంలో చేరాలన్న లక్ష్యం పెట్టుకోవాలని చిన్నారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రకృతి విపత్తు ఘటనల్లో అనేక మంది పౌరులను రక్షించేందుకు సైన్యం కృషి చేసిందన్నారు.
‘‘బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యం. దేశసేవ చేయాలనుకుంటే, దేశంతోపాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే త్రివిధ దళాల్లో చేరడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుంది’’ అని జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. చిన్నారులతో ముచ్చటించిన ఆయన.. ఈ ఏడాది ప్రకృతి విలయ సంఘటనలు అధికంగా చోటుచేసుకున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లలో అనేక మందిని రక్షించేందుకు సాయుధ దళాలు తీవ్ర కృషి చేశాయన్నారు.ఆపరేషన్ సిందూర్ గురించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై దాడులు చేశామని, ఒంటి గంటకు తొలి దాడి జరిగిందని చెప్పారు. సుదీర్ఘ లక్ష్యాలపై రాత్రి వేళల్లో దాడులు చేయాలంటే ప్రత్యేక కృషి అవసరమన్నారు.

ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోళ పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు కొన్నిచోట్ల పూర్తి ఎరుపు రంగులో దర్శనమివ్వనుండటం విశేషం. దీన్నే ఖగోళ శాస్త్ర పరిభాషలో 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలైంది. ఇది అర్ధరాత్రి దాటి సోమవారం తెల్లవారుజామున 1 గంట 31 నిమిషాల వరకు కొనసా గింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం వీక్షించేందుకు అవకాశం కలిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా బ్లడ్ మూన్ దృశ్యంపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ నెల 7వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8:58 గంటలకు మొదలై 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి, తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం విడవనుంది. నార్త్, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ కానీ, బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.

ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను మానసిక వైద్యశాలగా మార్చాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో విశాఖలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.‘‘అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారు. కానీ, గత ప్రభుత్వంలో అన్ని తాకట్టులో పెట్టడం చూశా. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్‌ను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని నా ఉచిత సలహా. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసం వాడాలి. మన అందరినీ ఇబ్బంది పెట్టారు. మనో ధైర్యంతో నిలబడాలి.. లొంగిపోకూడదు. మన వీర సైనికులు ప్రపంచానికి మన సత్తా చూపించారు. అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించాం’’ అని అశోక్‌గజపతిరాజు అన్నారు.
కైలాసగిరిపై సిద్ధమైన గాజు వంతెన
విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజు వంతెన పర్యాటకులకు థ్రిల్ పంచనుంది. మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఇది దేశంలోనే అతి పొడవైనది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీనిని నిర్మించినా.. భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తారు. దీనిపైకి ఎక్కిచూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, కొత్త లోకంలో విహరిస్తున్న భావన పర్యాటకులకు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
లిక్కర్ కేసులో సిట్ దూకుడు
ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు, కంపెనీల్లో సిట్ తనిఖీలు చేసింది. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో, నలందానగర్లోని నిఖిలానంద అపార్టుమెంట్లో అధికారులు సోదాలు చేశారు. విజయానందరెడ్డి 2024లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ను రెండ్రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్సుతో సీబీఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు వెళ్లి ఆయా కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీల్లోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీల్లో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సమాచారం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సిట్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. సిట్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. విరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధించి హైదరాబాద్‌లోనూ సిట్ తనిఖీలు సాగుతున్నాయి. తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో, తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల తర్వాత సిట్ కీలక నేతలను అరెస్ట్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని "రామ్‌లాల్ వృద్ధాశ్రమం" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అద్దెకు తాతయ్య, అమ్మమ్మ' అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతిని అందిస్తుంది.
ఈ కార్యక్రమం కింద వృద్ధాశ్రమంలోని వృద్ధులను నెల రోజుల పాటు కుటుంబాలు తమతో పాటు ఉంచుకోవచ్చు. దీని కోసం కుటుంబాలు రూ.11వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన మొత్తంలో సగం అద్దెకు వెళ్లిన వృద్ధుడికి, మిగిలిన సగం ఆశ్రమానికి కేటాయిస్తారు. ఇలా అద్దెకు వెళ్లే వృద్ధులకు కొంత ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, వారు కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతిని పొందుతారు. ఇది వారికి ఒంటరితనం నుంచి ఉపశమనం ఇస్తుంది. అటు వైపు, ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు తాతలు, నాయనమ్మల ప్రేమ, కథలు, అనుభవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది జనరేషన్ మధ్య గ్యాప్ ఫిల్, చేయడానికి యువతలో పెద్దల పట్ల గౌరవాన్ని, సానుభూతిని పెంచుతుంది. ఈ సిస్టమ్ జపాన్‌లో ఉండటాన్ని చూసి.. తాము కూడా ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థపై మరింత చర్చను లేవనెత్తుతుంది.

వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్‌పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల సర్దుబాటు ఈ LPG సిలిండర్లను రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, మార్కెట్ పరిస్థితుల ప్రకారం ప్రతి నెలా గ్యాస్ ధరలు నిర్ణయించబడతాయి.

చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన ఆరోగ్య హక్కులలో ఇది ఉందని స్పష్టం చేసింది. ‘మందుల చీటీ, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పత్రాలు, అందుతున్న చికిత్స గురించి తెలుసుకునే హక్కు ప్రతి రోగికి ఉంది.దీంతో ఆ డాక్యుమెంట్లు స్పష్టమైన రాతలో ఉండాలి. అందులోని విషయం రోగికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి’ అని జస్టిస్ జస్గురుప్రీత్ ఈనెల 27న తీర్పు చెప్పారు. ఒక కేసులో మెడికో లీగల్ నివేదిక అర్థం కాని రాతలో ఉండటంతో కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారించింది.

అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, సినీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య కారణంగా అర్థరాత్రి కన్నుమూశారు. మధ్యాహ్నం కోకాపేలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్‌చరణ్ మైసూర్ నుంచి, బన్నీ ముంబై నుంచి చేరుకోనున్నారు. అరవింద్, చిరంజీవి అంత్యక్రియలు నిర్వర్తిస్తుండగా, పవన్ కళ్యాణ్, నాగబాబు రేపు విచ్చేసి కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నారు. కనకరత్నమ్మ, రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అవుతుంది. రాంచరణ్ మైసూర్ నుంచి , బన్నీ ముంబై నుంచి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకొంటారు . అల్లు అరవింద్, చిరంజీవి ఇప్పటికే భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పవన్ నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు.

మనిషి జీవితం రెప్ప పాటే అనే ధర్మానికి కడపలో స్మశానంలో ఏర్పాటు చేసిన రిజర్వ్‌డ్ బోర్డులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భార్య చనిపోతే భర్త తమవారి సమాధి నిర్మించి పక్కనే తమ సమాధికి అవసరమైన స్థలాన్ని ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. మరణానంతరం మట్టిలో కలిసినా పక్కనే ఉండాలని ఇలా చేస్తున్నారట. కడప రిమ్స్ సమీపంలోని క్రైస్తవుల సమాధి తోటలో రిజర్వు చేసిన ప్రాంతాల్లో బోర్డులు పాతారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చర్చించుకుంటున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ త్వరలో భారత్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్ చుక్ తెలిపారు. జెలెన్ స్కీ పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కీవ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్ కు ఆహ్వానించారు.
ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీలతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్ కు రానున్నారు.

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సోదరి కావడంతో, దగ్గుబాటి కుటుంబంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కాసేపటి క్రితం కన్నుమూశారు. నందమూరి పద్మజ..మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. అంత్యక్రియలపై నందమూరి కుటుంబం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్‌పట్నం పరిధి ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోమవారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉల్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన మందుపాతర ని మావోయిస్టులు పేల్చారు. దీంతో డీఆర్‌జీ జవాన్ దినేశ్ నాగ్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని దవాఖానకు తరలించారు. ఈమేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

న్యూయార్క్ నగరంలోని అప్‌పర్ ఈస్ట్ సైడ్ శుక్రవారం ఉదయం పెద్ద పేలుడు ధాటికి కుదేలైంది. ఈ ఘటనలో మాన్‌హాటన్ పక్క ప్రాంతం మొత్తాన్ని దట్టమైన నల్ల పొగ కప్పేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. దీని తర్వాత అక్కడే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నియంత్రించడానికి భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం అప్పటికే ఆగి ఉన్న ప్రయాణికులు లేని విమానాన్ని ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి ఎయిర్‌పోర్టులోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. ఆ విమానాన్ని 2011లో తయారు చేశారని పేర్కొన్నారు.

ఆఫ్రికా దేశమైన ఈక్వెడార్‌లో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నైట్‌క్లబ్ వద్ద ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గయా ప్రావిన్స్‌లోని శాంటా లూసియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ఈక్వెడార్‌లోనే అత్యంత భయంకర ప్రాంతంగా పేర్కొంటారు. బాధితులందరూ 20 నుంచి 40 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన సాయుధులైన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారని అక్కడి మీడియా పేర్కొంది. ఇటీవల కాలంలో ఈక్వెడార్‌లో వరుస అల్లర్లు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటనకు కారణాలు మాత్రం తెలియరాలేదు. మొత్తం 1.8 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్‌లో ఈ ఏడాదిలో మొత్తం 4600 మంది అల్లర్లలో చనిపోయారు. గతేడాది 7,000 మంది చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


