పూరిగుడిసెలో ఉన్న వ్యక్తి ఎంపీగా.. ఏమీ లేకపోయినా..

పూరిగుడిసెలో ఉన్న వ్యక్తి ఎంపీగా.. ఏమీ లేకపోయినా..

అధికారంలోకి వచ్చేంత వరకు అందరూ నావాళ్లే అంటారు. నా ప్రతి రక్తపు బొట్టు వారికోసమే అంటారు. ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్నాక తిరిగి మళ్లీ చూడరు. అయిదేళ్లలో దండుకోవలసిందంతా దండుకుంటారు. చేసిన వాగ్ధానాలు, చెప్పిన శ్రీరంగ నీతులు అన్నీ గాలికి వదిలేస్తారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే కోట్లు ఉండాలా.. మనుషులకు మందు, డబ్బు ఎరగా వేయాలా.. రౌడీలకే రాజ్యాన్ని కట్టబెడతారా అంటే కానే కాదని చెబుతున్నారు ఒడిశా బాలాసోర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రతాప్ చంద్ర సారంగి.

ప్రజల గుండెల్లో కొలువై వుండాలంటే మాటలు కాదు సేవతోనే సాధ్యం అంటారు ఆయన. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఎంపీగా ఎన్నికయ్యారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా బీజేడీ అభ్యర్థి రవీంద్ర కుమార్ జెనాపై 12,956 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుర్తా పైజామా. భుజానికి ఓ బ్యాగు. ఎంతదూరమైనా సైకిల్‌పై ప్రయాణం. చూసిన వాళ్లెవరు ఆయన్ను ఓ ప్రజా ప్రతినిధి అంటే నమ్మరు. ఆయన నివసించేది ఓ పూరి గుడిసెలో. అక్కడినుంచే పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించారు.

అవివాహితుడైన సారంగిని అందరూ ఒడిశా మోదీ అని పిలుచుకుంటారు. ప్రజాప్రతినిధిగా తనకు వచ్చే జీతాన్ని, ఇతర నిధులను కూడా ప్రజోపయోగానికే వినియోగిస్తుంటారు. సైకిల్‌పై ప్రయాణిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ, సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా జీవితానికే అంకితమైన సారంగి అంటే జనానికి విపరీతమైన అభిమానం. ప్రధాని మోదీ సైతం ఒడిశా వచ్చిన ప్రతిసారీ సారంగిని కలిసే వెళతారు.

చిన్నప్పటినుంచి సారంగికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆదివాసీ ప్రాంతాలైన మమూర్ భంజ్., బాలాసోర్‌లలో ఎన్నో స్కూళ్లు స్థాపించి ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 2004, 2009లో నీలగిర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సారంగి.. 2014లో బాలాసోర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. ఈ సారి మాత్రం 12 వేల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై గెలిచి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు.

Tags

Next Story