అన్నగారిని ఆశ్చర్యపరిచిన మూవీ అదేనా..!

అన్నగారిని ఆశ్చర్యపరిచిన మూవీ అదేనా..!

1949లో మనదేశం సినిమాతో ఆరంభమైన ఎన్టీఆర్ నట ప్రస్థానం మూడు దశాబ్ధాలకు పైగా అప్రతిహతంగా కొనసాగింది. అయితే అప్పటికే కాస్త వయసు మీదపడింది. కొత్త తరం నటులు వచ్చారు.. వస్తున్నారు. ఇక తను వయసుకు తగ్గ పాత్రలకు టర్న్ తీసుకోవాల్సిందేనా అని ఆలోచిస్తోన్న టైమ్ లో ఆయన అభిమాన దర్శకులు కొత్తకోణంలో ఆలోచించారు. ఎన్టీఆర్ కు పూర్తిగా కమర్షియల్ స్టార్ గా మార్చేశారు. ఆ మార్పుకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో ఎన్టీఆర్ కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలైంది.

ఎన్టీఆర్ 250వ సినిమా దానవీరశూరకర్ణ తర్వాత వచ్చింది అడవి రాముడు. ఎవరూ ఊహించని చిత్రం అది. అదే స్థాయిలో అఖండ విజయం సాధించి అన్నగారిని సైతం ఆశ్చర్యపరిచింది. ఆయన డ్రెస్సింగ్ నుంచి, మేకోవర్ వరకూ ప్రతిదీ కొత్తగానే ఉంటుందీ చిత్రం. అప్పటి వరకూ వచ్చిన ఎన్టీఆర్ చిత్రాలకు భిన్నంగా పూర్తి స్థాయి కమర్షియల్ మూవీగా వచ్చింది. ఇక ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ కెరీర్ కొత్త పుంతలు తొక్కింది.

రాఘవేంద్రరావు క్రియేట్ చేసిన అడవి రాముడు తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన వేటగాడు మరో కమర్షియల్ హిట్. అంతకు ముందే యమగోలతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ దూకుడులోనే రాముడు పేరు మీదుగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. డ్రైవర్ రాముడు, శృంగార రాముడు ఇలా.. టైటిల్ ఏదైనా చివర్లో రాముడు కామన్. ఇక గజదొంగ, తిరుగులేని మనిషి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి సినిమాలు ఆయన్ను యాక్షన్ హీరోగా మార్చాయి.అయితే రాఘవేంద్రరావుకు భిన్నంగా దాసరి నారాయణరావు అన్నగారిలో కొత్త కోణాన్ని చూపించారు ప్రేక్షకులకు. నిజానికి ఈయన తీసిన సినిమాలే తర్వాత అన్నగారి రాజకీయారంగేట్రానికి పునాదులుగా నిలిచాయి. అవే సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి. ఈ రెండు సినిమాల్లోనూ ద్విపాత్రాభినయం చేశారు. అప్పటి వరకూ వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఆయన అగ్రెసివ్ రూపానికి ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. ఆ చిత్రాల్లోని డైలాగ్స్ నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా ఎలా చూసినా కమర్షియల్ సినిమాల్లోనూ ఇన్నేసి వైవిధ్యాలు చూపించిన వారిలో సరిలేరు ఆయనకెవ్వరూ.. సరిరారు ఇంకెవ్వరూ.

Tags

Read MoreRead Less
Next Story