రైతులను నట్టేట ముంచిన బ్యాంక్ ఉద్యోగి.. కోటి రూపాయలు..

రైతులను నట్టేట ముంచిన బ్యాంక్ ఉద్యోగి.. కోటి రూపాయలు..

ఖాతాదారుల సొమ్ముకు భద్రతగా ఉండాల్సిన బ్యాంక్ ఉద్యోగి మోసగాడిగా మారాడు. ఒకే పేరుతో రెండు ఖాతాలు తెరిచి కస్టమర్ల సొమ్ము కాజేశాడు. కృష్ణా జిల్లాలో రైతులను నట్టేట ముంచి పరారైన క్యాషియర్ బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. పరిటాల SBIలో శ్రీనివాసరావు గత 5 సంవత్సరాలుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 90 మంది రైతులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి లక్ష రూపాయల చొప్పున రుణాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వాయిదాలు ప్రతి నెలా బ్యాంక్‌లో చెల్లిస్తున్నారు. అయితే ఇదే బ్యాంక్ లో పనిచేస్తున్న శ్రీనివాస రావు ఒక్కో రైతు పేరుతో రెండు ఖాతాలు తెరిచి, వాళ్ల పేరుతో మరో లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఆ నగదు కొట్టేశాడు.

గత కొన్ని రోజులుగా వాయిదా చెల్లించడానికి వెళ్తున్న రైతులు అప్పులకు సంబంధించిన సమాచారం అడిగితే, సర్వర్లు పనిచేయడం లేదని కంత్రీ క్యాషియర్ దాటవేస్తున్నాడు. అనుమానం వచ్చిన రైతులు గట్టిగా నిలదీయడంలో బ్యాంక్ నుంచి ఉడాయించాడు. శ్రీనివాసరావు ఫేక్ ఖాతాలతో సుమారు కోటి రూపాయల వరకు కాజేసినట్టు తెలిసింది. దీనిపై రైతులు మేనేజర్ ను నిలదీయగా, ఆయన తనకేమీ తెలియదని చెప్పాడు. సొమ్ము కొట్టేసిన క్యాషియర్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి చేతులెత్తేశాడు. శ్రీనివాస రావు మోసానికి బలైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీసుకోని అప్పును ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story