సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే జగన్‌ డ్రీమ్‌ టీం రెడీ..?

సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే జగన్‌ డ్రీమ్‌ టీం రెడీ..?

సీఎంగా ప్రమాణ స్వీకారాని ముందే జగన్‌ తన డ్రీమ్‌ టీంను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీకి వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు రావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అందుకు జగన్‌ అంగీకరించారని… కీలకమైన శాఖను అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారని ఐ.ఎ.ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐ.ఎ.ఎస్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. ఆమె కెరీర్‌ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని ఏపీ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీలక్ష్మి దరఖాస్తు విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర ఏపీకి వెళ్లడం ఖాయమైంది. శ్రీలక్ష్మి ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోవడం ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే బాటలోనే మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వైఎస్‌ హయాంలో వెలుగు వెలిగిన అధికారులంతా జగన్‌ హయాంలో తమకు పునర్‌ వైభవం దక్కుతుందని ఆశిస్తున్నారు.

Read MoreRead Less
Next Story