స్వచ్ఛందంగా రాజీనామా చెయ్యం.. వాళ్లు రద్దు చేస్తే చెయ్యొచ్చు.. - టీటీడీ చైర్మన్

తమకు తాముగా TTD బోర్డు నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాలకమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది వారి ఇష్టం అన్నారు. స్వామివారి సన్నిధిలో తామంతా ప్రమాణం చేశామని.. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. ఇవాళ తిరుమలలో నిర్వహించతలపెట్టిన సమావేశానికి EO, JEO గైర్హాజరయ్యారు. అన్నమయ్య భవన్‌కు వచ్చినా.. కాసేపటికే వెనుతిరిగారు. ఇవాళ్టి మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ముందుగా చెప్పినా.. చివరికి అవేమీ ప్రస్తావనకు రాలేదు.
టీటీడీ పాలకమండలి సమావేశంపై ఉదయం నుంచి గందరగోళం నెలకకొంది. దీంతో ఈవో సింఘాల్, జేఈవో మీటింగ్ మధ్యలో వెళ్లిపోయారు. జేఈవోపై టీటీడీ బోర్డు మెంబర్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏళ్ల తరబడి తిష్టవేసిన వారివల్లే దేవస్థానానికి చెడ్డపేరు వస్తోందన్నారు. భక్తుల్ని పట్టించుకోకుండా వీఐపీల సేవకు అంకితమైతే ఎలా అని జేఈవోను ప్రశ్నించారు. టీడీపీ ఓడిపోయినందున నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు చల్లా బాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com