వారికి కేబినెట్ బెర్తులు దాదాపుగా ఖరారు..

నరేంద్రుని పట్టాభిషేకానికి రంగం సిద్ధం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అమాత్యులపై పడింది. మోదీ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందోనని అటు పార్టీ వర్గాలు, ఇటు కార్యకర్తలు, అభిమానులు ఆస క్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు, మోదీ ఫస్ట్ టర్మ్‌లో కేంద్రమంత్రులుగా పని చేసిన సీనియర్ నాయకులకు ఈసారి కూడా కేబినెట్ బెర్తులు దాదాపుగా ఖరారయ్యాయి. రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, మేనకా గాంధీ, జేపీ నడ్డా, ధరేంద్ర ప్రధాన్‌లకు మంత్రి పదవులు ఖాయమైనట్లే. అనారోగ్యం కారణంగా మంత్రి పదవిలో కొనసాగలేనని అరుణ్ జైట్లీ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాసినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చు.
ఇక, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కేంద్రమంత్రి కావడం లాంఛనప్రాయమే. మోదీ మంత్రివర్గంలో అమిత్ షాకు కీలక పదవి లభిస్తుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు బెంగాల్, ఒడిశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు మోదీ కేబినెట్‌లో ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. బెంగాల్‌లో పార్టీకి అత్యధిక ఎంపీలు రావడంలో కీలక పాత్ర పోషించిన ముకుల్ రాయ్‌కు కూడా అవకాశమిస్తారని చెబుతున్నారు.
మిత్రపక్షాలకు కూడా సముచిత స్థానం కల్పించనున్నారు. శివసేన, జేడీయూ, ఎల్జేపీ, అకాలీదళ్, అన్నా డీఎంకే, అప్నాదళ్ పార్టీలకు మోదీ కేబినెట్‌లో స్థానం లభించనుంది. శివసేనకు చెందిన అనంత్ గీతే, మోదీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఐతే, తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దాంతో శివసేన నుంచి రాజ్యసభ సభ్యులు అనిల్ దేశాయ్, సంజయ్ రౌత్‌ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అకాలీదళ్ తరఫున హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌కు వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది.
బీహార్‌లో కీలక మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీలకు మోదీ కేబినెట్‌లో పెద్ద పీట వేయనున్నారు. జేడీయూ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఆర్సీపీ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్ రేస్‌లో ఉన్నారు. ఎల్జేపీ తరఫున రామ్ విలాస్ పాశ్వాన్‌కు మరోసారి అవకాశమివ్వనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కీలక మిత్రపక్షం అప్నాదళ్‌కు ఒక బెర్త్ లభించనుంది. అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు వరుసగా రెండోసారి కేంద్రమంత్రి పదవి లభించనుంది.
శాఖల కేటాయింపులోనూ కీలక మార్పులు ఉంటాయని సమాచారం. అత్యంత ముఖ్యమైన ఆర్థికశాఖను పీయూష్ గోయల్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో రైల్వే మంత్రిగా పని చేసిన గోయల్, జైట్లీ గైర్హాజరులో ఆర్థికశాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అందుకే ఈసారి ఆర్థికశాఖను గోయల్‌కు కేటాయిస్తారని చెబు తున్నారు. అమిత్ షాకు హోంశాఖ కేటాయించే అవకాశముందని సమా చారం. కేంద్ర హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాధ్‌సింగ్‌కు వ్యవసాయ శాఖ, రక్షణమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు మానవ వనరుల శాఖను అప్పగిస్తారని అంటున్నారు. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీకి ప్రమోషన్ ఇచ్చి, కీలకమైన శాఖను అప్పగించే అవకాశాలున్నాయి.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com