హనుమంతుని మరణాన్ని ఆదేశించిన రాముడు..

హనుమంతుని మరణాన్ని ఆదేశించిన రాముడు..

తన ఇష్టాన్ని, తన ప్రేమని, తన భక్తిని, తను అమితంగా ఆరాధించే ఆరాధ్య దైవాన్ని హృదయంలో నిలుపుకున్న అమిత పరాక్రమవంతుడు ఆంజనేయస్వామి. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచిన వాడు హనుమంతుడు. వాయుదేవుని పుత్రుడైన హనుమ శ్రీరామ దాసుడు. హనుమ లేని రామాయణం పరిపూర్ణం కాదు. అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. మనసుని మందిరంగా చేసుకుని శ్రీరాముని భక్తితో ఆరాధించాడు. ధైర్యం, శక్తి సామర్థ్యాలకు హనుమంతుడు ప్రతీక. తన ఆరాధ్యదైవం రాముడు బాధని తన బాధగా భావించి సీతమ్మ తల్లి జాడ కోసం ఆకాశ మార్గాన ప్రయాణించి లంకలో ప్రవేశించాడు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకువచ్చి లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణుని గర్వం అణచినవాడు. అంతటి బల పరాక్రమవంతుడు అయిన వీరహనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు, మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.
హనుమంతుని శరీరమంతా సింధూరం.. ఎందుకంటే..
ఓ సారి సీతమ్మ నుదుటన సింధూరం చూసి హనుమ.. తల్లీ ఏమిటి ఆ సింధూర మహత్యం అని అడుగగా ఆమె చిరునవ్వుతో నా రాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె సమాధానం చెబుతుంది. ఆ మాట విన్నంతనే హనుమ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. శ్రీరాముని పట్ల తనకున్న భక్తిని ఆ విధంగా చాటుకుంటాడు. అందుకే హనుమంతుని విగ్రహాలన్నీ దాదాపుగా సింధూర వర్ణంలో దర్శనమిస్తుంటాయి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడని భక్తుల నమ్మకం.
హనుమంతునికి ఇష్టమైన సంఖ్య..
హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే ఐదు ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుడిని భక్తితో ధ్యానిస్తే శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. హనుమాన్ చాలిసాను ఒకటి, మూడు, ఐదు, పదకొండు లేదా 41 సార్లు పారాయణం చేస్తే చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరితగతిన పూర్తవుతాయి.
హనుమంతుని ఓ కుమారుడు ఉన్నాడన్న విషయం తెలుసా..
లంకా దహనం తరువాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకుని శరీరాన్ని చల్లబరుచుకునే నిమిత్తం సముద్రంలో మునుగుతాడు. ఆ సమయంలో హనుమ శరీరం నుంచి వచ్చిన చెమట బిందువుని మత్య్సం సేవించడం ద్వారా మకరద్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగిందని పురాణాలు చెబుతుంటాయి. హనుమ బ్రహ్మచారి అయినా అతని కుమారునిగా మకరద్వజుడు కీర్తింపబడతాడు.
హనుమంతుని మరణాన్ని కోరిన రాముడు..
ఒకసారి నారదుడు హనుమ దగ్గరకు వెళ్లి ఋషులందరకీ అభివాదం చేయి కానీ విశ్వామిత్రునికి మాత్రం చేయవద్దని చెబుతాడు. దానికి కారణం ఆయన రాజుగా ఉన్నప్పుడు ఋషులకు తగినంత గౌరవం ఇవ్వలేదని చెబుతాడు. నారదుని ఆజ్ఞ మేరకు హనుమ అలాగే చేస్తాడు. నారదుడు మళ్లీ విశ్వామిత్రుని వద్దకు వెళ్లి హనుమ ఏమిటి మిమ్మల్ని అగౌరవపరిచాడు అని అడుగుతాడు. దీంతో ఆగ్రహించిన విశ్వామిత్రుడు హనుమని బాణాలతో వధించమని శ్రీరాముడిని ఆజ్ఞాపిస్తాడు. గురువు ఆజ్ఞను శిరసావహించే రాముడు, హనుమకు మరణశిక్షను ఆదేశిస్తాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన నారదుడు తాను చేసిన తప్పేంటో తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్లి హనుమను రక్షించమని వేడుకుంటాడు.

Tags

Read MoreRead Less
Next Story