భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అంటే ఆ క్రేజే వేరబ్బా..

భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అంటే ఆ క్రేజే వేరబ్బా..

ప్రపంచ క్రికెట్‌లో ఫార్మేట్‌ ఏదైనా భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు… చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరును అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ళు యుధ్ధంలా భావిస్తారు. ఆట కంటే భావోద్వేగాలకే ఈ మ్యాచ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి ప్రపంచకప్‌లో కూడా భారత్‌,పాక్ మధ్య పోరు హైలైట్‌గా నిలవబోతోంది. టోర్నీ షెడ్యూల్ ప్రకటించినప్పుడే టిక్కెట్ల కోసం అభిమానులు క్యూ కట్టారు. కేవలం రెండు గంటల్లోనే మ్యాచ్ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం రెండు దేశాల అభిమానులే కాదు క్రికెట్ ఆడే అన్ని దేశాల అభిమానుల్లోనూ ఇండో-పాక్ మ్యాచ్ అంటే అమితాసక్తి.

రికార్డుల పరంగా ప్రపంచకప్‌లో ఎప్పుడు చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ జరిగినా భారత్‌దే పైచేయిగా నిలుస్తోంది. ఈసారి కూడా టీమిండియానే పాక్‌పై మ్యాచ్‌లో ఫేవరెట్‌. అయితే ఎప్పుడేలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవనేది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద భారత్‌,పాక్ పోరే ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌.

మరోవైపు ఈ మెగా టోర్నీలో మరికొన్ని మ్యాచ్‌లు కూడా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌కు కూడా మంచి క్రేజ్ ఉంది. యాషెస్ సిరీస్‌ ద్వారా ఎప్పుడు ఈ రెండు జట్లు తలపడినా… అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. దీనికి తోడు నిషేధం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన స్మిత్, వార్నర్‌లను ఇప్పటికే ఇంగ్లీష్ ఫ్యాన్స్ టార్గెట్‌ చేసుకున్నారు. వార్మప్ మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఛీటర్స్… ఛీటర్స్ అంటూ వెక్కిరించారు. దీంతో లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లో ఇలాంటి సీన్స్‌తో రెండు జట్ల మధ్య మరింత హీట్ పెరగడం ఖాయం.

అటు వెస్టిండీస్, సౌతాఫ్రికా… న్యూజిలాండ్,ఆస్ట్రేలియా… ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లపైనా ఆసక్తి పెరిగింది. ఆయా జట్లు బలాబలాల పరంగా సమఉజ్జీలుగా ఉండడమే ఈ ఆసక్తికి కారణం. మొత్తం మీద టోర్నీలో ఇలాంటి మ్యాచ్‌లపై ఆసక్తి తారాస్థాయిలో ఉండడం అటు నిర్వాహకులకూ , ఇటు బ్రాడ్‌కాస్టర్లకూ అమితానాందనాన్ని కలిగిస్తోంది.

Tags

Next Story