మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న ఖమ్మం ఎంపీ నామా..

మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న ఖమ్మం ఎంపీ నామా..

ఢిల్లీలో మరోసారి చక్రం తిప్పబోతున్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు. గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి కూడా అలాంటి కసితోనే పనిచేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ జెండా రెపరెపలాడినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పార్టీని దెబ్బతీశాయి. అయితే.. నామా నాగేశ్వర్‌రావు సైకిల్‌ను వీడి కారెక్కిన తర్వాత పరిస్థితి మారింది. అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేశారాయన. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేశారు.

ఖమ్మం నుంచి గెలిచి మరోసారి పార్లమెంట్‌లో కాలు పెట్టబోతున్నారు నామా నాగేశ్వర్‌రావు. గతంలో పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ADR సర్వేలో 10 పాయింట్లకు 7.62 రేటింగ్ సాధించారు. పార్లమెంట్‌కు హాజరు విషయంలో నేషనల్ యావరేజ్ 76 కాగా… నామా నాగేశ్వర్‌రావుకు 86 మార్కులు వచ్చాయి. 120 చర్చల్లో.. 114 డిబేట్స్‌లో పాల్గొన్నారు. నాడు ఐదేళ్లలో ప్రజా సమస్యలపై 488 ప్రశ్నలు సంధించారు. ఇవి నేషనల్ యావరేజ్‌ కన్నా చాలా ఎక్కువ. స్టేట్ యావరేజ్ విషయానికి వస్తే.. హాజరు 68 శాతం, డిబేట్స్‌ 20, ప్రశ్నలు 339.. ఎలా చూసినా నామా నాగేశ్వర్‌రావు పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందేలా చూడడంలో.. సొంత నియోజకవర్గంలో సాగు-తాగు నీరు, హౌసింగ్ పథకాలు చేయడంలో ముందున్నారు నామా నాగేశ్వర్‌రావు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో టచ్‌లో ఉండడంలోను నామా తర్వాతే ఎవరైనా. ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూ.. ర్యాలీలు తీస్తూ.. కేడర్‌లో ఉత్సాహం నింపారు. ప్రజల మనిషిగా గుర్తింపుతెచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story