పెళ్లి చేసిన పూజారితోనే.. పెళ్లి కూతురు జంప్..

పెళ్లి చేసిన పూజారితోనే.. పెళ్లి కూతురు జంప్..

ఎవరికి ఎవరో ముందే రాసి పెట్టి ఉందంటారు. మరి అది ఎంత వరకు నిజమో. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిపించే పూజారితోనే పెళ్లి కూతురు జంప్ అయితే ఏమనాలో అర్థం కావట్లేదు ఊరి ప్రజలకి. మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌కు చెందిన వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవగానే సంప్రదాయం ప్రకారం అత్తింట్లోకి అడుగు పెట్టింది నవ వధువు. అక్కడినుంచి ఓ రోజు అమ్మగారింటికి వచ్చింది కొత్త పెళ్లి కూతురు.

రెండ్రోజులు ఇంట్లోని వారికి ఏమీ అనుమానం రాకుండా ప్రవర్తించింది. మూడో రోజు మూటా ముల్లె సర్థుకుని పెళ్లి చేసిన పూజారితోనే జంప్ అయ్యింది. వెళ్తూ వెళ్తూ పుట్టింట్లో ఉంచిన 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు, భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు పూజారి కుటుంబ సభ్యులు.. పూజారి కూడా కనిపించట్లేదంటూ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూజారీ, కొత్త పెళ్లి కూతురు కలిసి జంప్ అయ్యారని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. రెండు సంవత్సరాలుగా ఇద్దరికీ పరిచయం ఉందని తెలుసుకున్నారు. అయినా ఆమెపై ప్రేమను దిగమింగుకుని మరో వ్యక్తితో వివాహం జరిపించాడు. అయినా ఆమెపై తన ప్రేమని చంపుకోలేకపోయాడు. ఇద్దరి పరిస్థితీ ఇలానే ఉండడంతో మరో ఆలోచన లేకుండా అర్థరాత్రి ఉడాయించారు.

కట్టుకున్న భార్యని, ముగ్గురు పిల్లల్ని గాలికి వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు పూజారి. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే చేసుకునే వాడిని కాదు కదా అని కొత్త పెళ్లి కొడుకు ఆగ్రహంతో ఉన్నాడు. పూజారి కుటుంబసభ్యులు ఊరిలో తలెత్తుకోలేక ఇంటి నుంచి ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లి పోయారు. పోలీసులు వీరిరువురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story