29 May 2019 5:35 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / వారెన్ బఫెట్ గోల్డెన్...

వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్

వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్
X

ప్రపంచ ధనవంతుల జాబితా లిస్ట్‌లో టాప్‌5లో ఉండే వారెన్ బఫెట్ ఒక రోజు సంపాదన రూ. 240 కోట్లు. ఇది చాలా గొప్ప విషయమే కావచ్చు. కానీ అంతకంటే గొప్ప విషయం ఆయన సంపాదనలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. ఒక మనిషి గొప్పతనం అతని సంపాదనలో కాదు.. ఔదార్యంలో ఉంటుంది అని బఫెట్ చెప్పకనే చెబుతారు. అందుకే ఆయన్ను ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులంతా స్ఫూర్తిగా తీసుకుంటారు.
అమెరికాలోని ఒమాహా పట్టణంలో 1930, ఆగస్టు 30న జన్మించిన బఫెట్.. ఇంటింటికి తిరిగి ఉదయాన్నే న్యూస్ పేపర్ వేసే వాడు. స్టాంప్‌లు అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో పిన్ బాల్ గేమ్ మిషన్ కొన్నాడు. దాని ద్వారా మరికొంత డబ్బు సంపాదించాడు. వచ్చిన సంపాదనతో మరో రెండు పిన్ బాల్స్‌ కూడా ఆదాయాన్ని మరింత పెంచుకున్నాడు. 11 ఏళ్ల వయసు వచ్చేసరికి షేర్ మార్కెట్‌లో అడుగు పెట్టాడు. షేర్లు కొనడం అమ్మడం చేసేవాడు. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే స్థాయికి ఎదిగాడు. కాలేజీలో చదివే రోజుల్లోనే బఫెట్ తనకు పాఠాలు చెప్పే ప్రోఫెసర్ కంటే ఎక్కువ సంపాదించేవాడు. 1962వ సంవత్సరంలో నష్టాల్లో ఉన్న Berkshire Hathway అనే కంపెనీలో పెద్ద మొత్తంలో షేర్‌లు కొన్నాడు. అప్పుడు ఒక్కో షేర్ విలువ 7 డాలర్లు (సుమారు 500 రూపాయలు). ఇప్పుడు ఆ షేర్ విలువ 3,00,000.00డాలర్లు. Coca Cola IBM Gillite, Philips, American Express.. ఇలా ఎన్నో కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు బఫెట్.


వారెన్ బఫెట్ …. గ్లోబల్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన వ్యూహాలు, పెట్టుబడికి మించి రాబడి సంపాదించడంలో ఆయనకు సాటి వచ్చేవారెవరూ దరిదాపుల్లో కూడా లేరని స్టాక్ ఎనలిస్టులు పేర్కొంటూ ఉంటారు. తాజాగా ఆయన ఒమహాలో నిర్వహించిన వాటాదారుల సమావేశంలో దాదాపు 40,000 మంది వాటాదారులు పాల్గొనడం ఓ సంచలనం. వారంతా వారెన్ బఫెట్ చెప్పే టిప్స్ గురించే అక్కడి వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఆయన తన వాటాదారులతో పంచుకున్న విషయాలను ఆయన మాటల్లోనే చూద్దామా…!


"నేను భవిష్యత్తులో అత్యంత ధనవంతుడిని అవుతానని తెలుసు. ఈ ప్రయత్నంలో ఒక్క నిమిషం కూడా నాపై నేను నమ్మకాన్ని కోల్పోలేదు".
" మీరు ఒక సినిమాకు వెళ్ళకుండా డబ్బులను ఆదా చేయడం సరికాదు. మీ సంతోషాలను త్యాగం చేసి మరీ పొదుపు గురించి ఆలోచించడం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఒక సంతోషకరమైన ఆనందాన్ని అనుభూతి చెందకుండా వాయిదా వేయడం అనేది సరైన ఇన్వెస్టర్‌కు ఉండాల్సిన లక్షణం కాదు."
" తక్కువ నష్టంతో బయట పడటం కూడా ఓ కళ "మీరు నమ్మిన దాన్ని మీకంటే మరెవరూ అంత ఎక్కువగా నమ్మకూడదు. బలమైన నిర్ణయం తీసుకుంటే అంతే బలమైన విజయం మీకు దక్కుతుంది" - వారెన్ బఫెట్
" విజయం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ దాన్ని గుర్తించలేకపోవడం నిజంగా మీ ఓటమే."
"డబ్బుకు సంతోషానికి సంబంధం లేదని వారెన్ బఫెట్ అంటుంటారు. నీ జేబులో 20,000 డాలర్లు, లేదా 50,000 డాలర్లు ఉన్నప్పుడు నీవు సంతోషంగా లేకుంటే… నీ దగ్గర 5 మిలియన్ డాలర్లు ఉన్నా కూడా నీవు సంతోషంగా ఉండవని బఫెట్ పేర్కొంటారు. టన్నుల కొద్దీ నోట్ల కట్టలు మనిషిని సంతోషంగా ఉంచలేవని బఫెట్ వాదన.
"నీ జీవనానికి, నీ కుటుంబ జీవనానికి తగినంత ఆర్ధిక భద్రత ఉంటే చాలు ..అది నీకు సంతోషాన్ని ఇస్తుంది" ,
అలాగే ఒక పని చేయాలనుకున్నప్పుడు వాయిదాలు వేయడం, లేదా ఆలస్యంగా ఆ పని వల్ల వచ్చే సంతోషం.. సంతోషమే కాదంటారు బఫెట్.
" ఒక కంపెనీ స్టాక్స్ కొనాలంటే.. మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారా లేదా అన్నది ప్రధానం "బఫెట్
ఖర్చు చేసిన తరువాత పొదుపు గురించి ఆలోచించకుండా.. ముందు పొదుపు చేసి ఆ తరువాత ఖర్చుచేయమంటారు బఫెట్.
నెల జీత కోసం నాలుగు రోజుల ముందు నుంచే ఎదురు చూస్తున్నారంటే మీరు సంపాదించాల్సినంత సంపాదించడం లేదని అర్థం. అందుకోసం చింతిస్తూ కూర్చోకుండా
ఆదాయం పెంచుకునే మార్గాల గురించి అన్వేషించండి అంటారు.
సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండమంటారు. మీరు తెలివిగల వారైతే అప్పు చేయకుండానే డబ్బు సంపాదించవచ్చు. నిజాయితీ చాలా విలువైంది. దాన్ని చిల్లరగాళ్ల నుంచి ఆశించవద్దని బఫెట్ ఎప్పుడూ చెబుతుంటారు.
బెర్క్ షైర్ హాత్ వే కంపెనీకి 88 ఏళ్ళ వయసు గల వారెన్ బఫెట్ ఛైర్మన్‌గా, CEOగా కొనసాగుతున్నారు. 60 ఏళ్ళుగా తన పార్టనర్‌గా ఉన్న ముంగర్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం కలిసే వ్యాపార నిర్ణయాలు తీసుకుంటామని, పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో కూలంకషంగా చర్చించే నిర్ణయాలు తీసుకున్నందువల్లే అవి విజయవంతమయ్యాయని బఫెట్ అంటారు.
తన సంపదని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుని ఎప్పుడూ పొంగి పోలేదు. వేల కోట్ల మిలియన్ డాలర్లు అధిపతి అయినా ఎప్పుడూ నిరాడంబర జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతుంటారు బఫెట్. అందుకే యాపిల్ కంపెనీలో వేల కోట్ల షేర్లు ఉన్న తను మాత్రం యాపిల్ ఫోన్ వాడరు. కనీసం పాకెట్‌లో స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన మనస్థత్వమే ఎంతో మందికి ఆయన జీవితం మార్గదర్శకమైంది. నిరాడంబరత, మంచితనం, గొప్ప మాట తీరు వలన బిల్‌గేట్స్ వంటి వారు తమ ఆరాధ్య దైవంగా చెప్పుకుంటారు. బఫెట్‌ని ఆదర్శంగా చూపుతారు.

Next Story