రాహుల్ అలకపాన్పు.. టెన్ జన్‌పథ్‌లో బుజ్జగింపుల యాత్ర

టెన్ జన్‌పథ్‌లో బుజ్జగింపుల యాత్ర కొనసాగుతోంది. అధినేతకు నచ్చ చెప్పడానికి కాంగ్రెస్ వర్గాలు శతవిథాలా ప్రయత్నిస్తున్నాయి. రోజుకో రాష్ట్రం నుంచి నాయకులు
ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని బుజ్జగిస్తున్నారు. వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రు లు, మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు… రాహుల్‌ను అలకపాన్పు నుంచి దింపడానికి ట్రై చేస్తున్నారు. అధ్యక్ష పదవిలో కొనసాగాలని, కాంగ్రెస్ పార్టీకే మీరే దిక్కంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
రాహుల్‌కు నచ్చచెప్పడానికి ఇప్పటికే సోనియా సహా పలువురు సీనియర్లు ప్రయత్నించగా, తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రంగంలోకి దిగారు. రాహుల్ ఇంటికి వచ్చిన ఆమె, ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, పార్టీ పటిష్టత కోసం పని చేయాలని హితవు పలికారు. నాయకుడే కాడి వదిలేస్తే క్యాడర్ బేజారవుతుందని హెచ్చరించారు. ఓటమి భారం నుంచి తేరుకొని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాహుల్‌కు బాసటగా నిలిచారు. రాహుల్ నాయకత్వంలోనే తామంతా ముందుకు వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని రాహుల్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా రంగంలో దిగారు. ఢిల్లీకి వెళ్లిన కుమారస్వామి, రాజీనామా చేయడం సరైంది కాదని రాహుల్‌కు సూచించారు. ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్నా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడం ఖాయమంటున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com