ఓటమికి పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చెయ్యాలని రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారా?

ఓటమికి పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చెయ్యాలని రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారా?

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవానికి తానొక్కడినే కాక, పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చెయ్యాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారా? పాత తరానికి చెక్‌పెట్టే ఉద్దేశంతో కదులుతున్నారా? మూడు రోజులుగా సాగుతున్న పరిణామాలు ఇవే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. తన సోదరి ప్రియాంక గాంధీతో పాటు కొందరు ముఖ్యులను మాత్రమే కలిశారు. ఆయన తన అభిప్రాయాలను, నిర్ణయాలను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీనియర్లను సాగనంపి కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకునేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని.. దీని వల్లే ఓడిపోయామని రాహల్ అంటున్నారు. అధ్యక్షుడికి స్వేచ్చ లేనప్పుడు పార్టీని ఎలా నడిపిస్తారన్నారు.

పైలట్‌ సహా సీనియర్ల వ్యవహారశైలిపై సీడబ్ల్యూసీ సమావేశంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాహుల్‌ తన వైఖరిని మార్చుకోలేదు. పార్టీలోని కొందరు సీనియర్లను దారిలోకి తీసుకువచ్చి, కాంగ్రెస్‌ మనుగడకు గాంధీ కుటుంబ ప్రమేయం ఆవశ్యకతను స్పష్టీకరించాలన్నదే రాహుల్‌, ప్రియాంకల మనోగతమని పార్టీ వర్గాలంటున్నాయి. తన కుటుంబంలోని వ్యక్తి కాకుండా వేరే ఒకరిని పార్టీ అధ్యక్షునిగా నియమించడం వల్ల తమ విలువేంటో సీనియర్లకు తెలియాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో సీతారాంకేసరి అధ్యక్షుడిగా విఫలమయ్యాడన్న కారణంతో ఆయనను తప్పించి.. సోనియాగాంధీ 1998లో పార్టీ పగ్గాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

అందుకే కొత్తవారికి పగ్గాలు అప్పగించేందుకే సిద్దమవుతున్నారు రాహుల్. ప్రత్యామ్నాయ అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా.. అంటే ఓ మూడు నెలల పాటు అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్‌గాంధీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వైదొలగాలన్న తన నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని, అది రాయబారాలకు, సంప్రదింపులకు అతీతమని రాహుల్‌ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రాజీ ఫార్ములాను రూపొందించారు. దీని ప్రకారం, మూడు లేదా నాలుగు నెలల వ్యవధిలో వేరే వ్యక్తిని పార్టీ చీఫ్‌గా ఎంపిక చేయాలి. ఈలోగా పెద్ద ఎత్తున ప్రక్షాళన కాకపోయినా సంస్థాగతంగా అవసరమైన మార్పుల్ని చేస్తారని ఆ వర్గాలు వివరించాయి. ఇందిరాగాంధీ సమయంలోనే తాము ధైర్యం కోల్పోలేదని, ఇపుడు కూడా రాహుల్‌ను వెళ్లనిచ్చేది లేదని, ఆయన మాట వినబోమని సీనియర్లు అంటున్నారు. గాంధీయేతర నాయకత్వం ఆశించిన ఫలితాలనివ్వదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story