వేదిక మార్చకపోతే పాక్-భారత్ మ్యాచ్..!!

వేదిక మార్చకపోతే పాక్-భారత్ మ్యాచ్..!!

రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్దాలు జరిగినా పాక్‌తో భారత్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. చూసే వారికి మజానిస్తుంది. ఎన్ని దేశాలతో ఆడినా పాకిప్తాన్‌తో మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే వుంటుంది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదనే కామెంట్లు వినిపించినా ద్వైపాక్షిక్ సిరీస్‌లు ఆడేందుకు నిరాకరించింది భారత జట్టు. ఈ విషయమై పాక్ క్రికెట్ బోర్డు, ఐసీసీని ఆశ్రయించడం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బీసీసీఐకి అనుకూలంగా తీర్పు వెలువరించడం తెలిసిందే.

అదలా ఉంచితే.. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2020 పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఇష్టపడని టీమిండియా.. ఇక ఆసియా కప్‌ని పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి వెళ్లేందుకు మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది. రెండేళ్లకోసారి ఆసియా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గత ఏడాది యూఏఈలో జరిగింది. టీమిండియా పాక్‌లో ఆడేందుకు ఒప్పుకోకపోతే.. తటస్థ వేదికపైన నిర్వహించే అవకాశం ఉంది.

ఐసీసీపై ఆధిపత్యాన్ని చూపిస్తున్న బీసీసీఐ ఈ విషయంలో పక్కగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐ మాట వినకుండా పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే మాత్రం మ్యాచ్‌ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ఈ వివాదం ఇలాగే కొనసాగి ఆసియా కప్‌లో భారత జట్టు ఆడకపోతే వీక్షకుల సంఖ్య భారీగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే వేదిక మార్పు విషయమై మరోసారి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత జట్టు చివరి సారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగలేదు. 2020లో జరిగే ఆసియా కప్‌తో పాటు, 2022లో జరగబోయే ఏషియన్ గేమ్స్ గురించి సింగపూర్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story