జీఎస్టీ ఎగవేతదారులపై సుప్రీం కొరడా

జీఎస్టీ ఎగవేతదారులపై  సుప్రీం కొరడా

జీఎస్టీ ఎగవేతదారులపై కొరడా ఝళిపించింది సుప్రీంకోర్టు . ఎగవేతదారుల అరెస్టుపై జీఎస్టీ అథారిటీలకు ఉన్న అధికారాలను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. నాలుగు వారాల తర్వాత ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఎగవేతదారుల అరెస్టులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

జీఎస్టీ ఎగవేత పేరిట నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంపై వివిధ హైకోర్టులు భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అరెస్టుపై చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు వెలువడేవరకు ఎగవేతదారుల పిటిషన్లపై విచారణ సమయంలో తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎగవేతదారుల అరెస్టును సమర్థించిన విషయాన్ని గుర్తించాలని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది.

జీఎస్టీ ఎగవేసిన వారిని అరెస్టు చేయవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో.. కోట్లు కొల్లగొట్టిన కేసులో అరెస్టయిన ఇన్ఫినిటీ మెటల్స్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌కు చెందిన రమణారెడ్డి.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Tags

Next Story