లంచం అడిగితే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫోన్ చేయండి : సీఎం జగన్

విజయవాడలో అంగరంగ వేడుకగా సాగింది జగన్ ప్రమాణ స్వీకారోత్సవం. అదే వేదికపై సర్వ మత ప్రార్థనలు జరిగాయి. అనంతరం ప్రసంగించిన కొత్త ముఖ్యమంత్రి తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. పెన్షన్లు పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారాయన. రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని మరోసారి జగన్ స్పష్టంచేశారు.
నవరత్నాలను ప్రతి ఇంటికి అందించేందుకు గ్రామాల్లో వాలంటీర్లను నియమిస్తానని జగన్ చెప్పారు. ఆగస్టు 15 నాటికి 4 లక్షల మందిని నియమిస్తానని.. అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా 5వేల రూపాయల జీతం ఇస్తానని ప్రకటించారు. అదే సమయంలో గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేయబోతున్నట్టు ప్రకటించారు కొత్త సీఎం జగన్. దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో స్పందన ఉంటుందన్నారు. లంచం అడిగితే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫోన్ చేయొచ్చంటూ ప్రకటించారు.
స్వచ్ఛమైన, అవినీతిలేని పాలన అందిస్తానంటూ ఆరు కోట్ల మందికి హామీ ఇస్తున్నా అన్నారు జగన్. ఏ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందో వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామన్నారు. ఖజానాకు ఎంత ఆదాయం మిగిలిందో ప్రజలకు లెక్కలతో సహా వివరిస్తానని చెప్పారాయన. హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతితో జ్యుడిషియల్ కమిషన్ వేసి.. ఆ సూచనలకు అనుగుణంగా కాంట్రాక్టులు అప్పగిస్తామని సీఎం తెలిపారు. ఏడాదిలో ప్రక్షాళన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం ఉండదన్నారు ముఖ్యమంత్రి. కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలు లేేకుండా ప్రతి ఒక్కర్నీ సమానంగా చూస్తామని, అర్హులందరికీ లబ్ది చేకూరుస్తానని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com