విజయమ్మ ఆనందానికి అవధుల్లేవు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ పట్టాభిషేకం పూర్తయింది. మధ్యాహ్నం 12 గంటల 23 నిమషాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకలో… జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు.
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్ కుటుంబసభ్యులు, తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ, తెలంగాణ స్పీకర్ పోచారం, ఆ రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కార్యకర్తలతో స్టేడియం నిండిపోయింది.
తనకు ఆకాశమంత విజయాన్ని అందించారంటూ భావోద్వేగంతో జగన్ ప్రసంగం సాగింది. పాదయాత్రలో, ప్రచారంలో ఇచ్చిన నినాదాల్ని మరోసారి గుర్తుచేసిన జగన్.. మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ప్రతి ఇంటికి నవరత్నాల్ని చేరుస్తానన్నారు.
జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దది అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ఆ బాధ్యత సమర్థంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలని తనదైన శైలిలో ప్రసంగించారాయన. ఆత్మీయత, అనురాగంతో సహకరించుకుంటూ అద్భుత ఫలితాలు రాబట్టాలని కేసీఆర్ అన్నారు.
మరో ముఖ్య అతిథిగా హాజరైన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్.. చాలా క్లుప్తంగా ప్రసంగించారు. వైఎస్సార్ వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.తన తనయుడు సీఎం అవగానే విజయమ్మ ఆనందానికి అవధుల్లేవు. జగన్‌ను గుండెలకు హత్తుకుంది. ముద్దు పెట్టి మనసారా ఆశీర్వదించింది.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com