మోదీ డ్రీం టీంలో కిషన్ రెడ్డి

మోదీ డ్రీం టీంలో కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల నుంచే ఒకేఒక్కరికి మోదీ డ్రీం టీంలో స్థానం దక్కింది. అయితే ఆయనకు కేబినెట్‌ ర్యాంక్‌ కాకుండా కేవలం సహాయమంత్రి హోదాయే దక్కింది. మరి ఆయనకు ఏ శాఖకు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒకేఒక్కడికి మోదీ టీంలో స్థానం దక్కింది. తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డిని ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధాని. క్రమశిక్షణ గల బీజేపీలో కిషన్ రెడ్డి అంకిత భావానికి మారుపేరు. సుశిక్షితుడైన సైనికుడాయన. ప్రత్యర్థులపై విరుచుకుపడే మిసైల్‌. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వాగ్దాటి ఆయన సొంతం. భారతీయ జనతాపార్టీలో కిషన్‌రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1960లో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌ రెడ్డి.. జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో యువ కార్యకర్తగా 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 1980లో బీజేపీలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా ఉన్నారు. 1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా 2014 నుంచి 2016 వరకు బాధ్యతలు నిర్వహించారు.

2004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం అంబర్‌పేటలోకి వచ్చింది. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. శాసనసభలో బీజేపీపక్షనేతగా ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై పోరాడారు. 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి చేతిలో 1,116 స్వల్ప ఓట్ల తేడాతో కిషన్‌ రెడ్డి ఓడిపోయారు. అయితే అది ఆయన పాలిట వరమైంది. నాలుగు నెలల తర్వాత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైనా, ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తించి మోదీ తన డ్రీం టీంలోకి తీసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రధాని ఏ శాఖ కేటాయించినా, చేస్తానన్నారు కిషన్ రెడ్డి.

గతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి మంచి పోర్ట్‌ఫోలియోలే దక్కాయి. అద్వానీ హోం శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆయనకు సహాయమంత్రిగా ఉన్నారు. బండారు దత్తాత్రేయ కూడా రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి కూడా కీలక శాఖే దక్కే అవకాశాలున్నాయి. ఆయన్ను హోంశాఖ సహాయ మంత్రిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ జరుగుతోంది. మరి కిషన్ రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారో వేచి చూడాలి.

Read MoreRead Less
Next Story