హోంమంత్రిగా అమిత్‌షాను నియమించడానికి కారణం అదేనా..?

రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్‌షాది కీలక పాత్ర. ఆయన్ను అపర చాణక్యుడిగా పిలుస్తారు కమలం పార్టీ నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసి నెంబర్ టూగా పేరు తెచ్చుకున్న అమిత్ షాకి హోంశాఖ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఉన్న జాతీయ అజెండా ఏంటి? అవును హోంశాఖ మంత్రిగా అమిత్ షాను ఎంపిక చేయడం వెనుక ప్రధాన వ్యూహం… ఇన్నాళ్లుగా చెబుతున్న జాతీయవాద ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్లడమేనని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అంతర్గతంగానూ, వెలుపలా ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకే అమిత్‌షానే కరెక్ట్ అనేది ప్రధాని మోదీ భావన. కఠిన నిర్ణయాలను తీసుకోవడంలో అమిత్‌షా వెనుకాడరని ప్రధాని భావించడంతోనే ఆయన్ను హోంమంత్రిగా నియమించారని చర్చ జరుగుతోంది. అంతే కాదు గుజరాత్ హోంమంత్రిగా షాను దగ్గర నుంచి పరిశీలించారు ప్రధాని. సోహ్రబుద్దిన్ ఎన్కౌంటర్ కేసుతో పాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు షా. గుజరాత్ హోంమంత్రిగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు ఎన్నో వివాదాస్పదమయ్యాయి. ఇదే సమయంలో అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం మోపాడనే పేరు కూడా షాకు ఉంది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతల విషయంలో అమిత్ షా కఠినంగా వ్యహరిస్తారనే ఉద్దేశంతోనే ఆయనకు హోంశాఖ పగ్గాలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల ప్రచార సమయంలో అమిత్ షా రెండు విషయాల్ని గట్టిగా వినిపించారు. ఇందులో దేశమంతా జాతీయ పౌరుల చిట్టా ఎన్ఆర్సీ అమలు చేయడం, రెండోది కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం. ఇవి అమిత్‌షాలో అజెండాల్లో ముఖ్యమైనవి. వీటితో పాటు మరో ముఖ్యమైనది బంగ్లాదేశ్ శరణార్థుల సమస్య. బెంగాల్ సాధారణ జీవనాన్ని అశాంతిమయం చేస్తున్న వలసవాదులందరినీ ఏరిపారేస్తామన్నారు అమిత్‌షా. బీజేపీ అధికారంలోకొస్తే దీన్ని చురుగ్గా చేపడుతుందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇదే కాదు కొన్ని రోజులుగా వివాదంగా మారుతున్న జమ్మూకాశ్వీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని 370తో పాటు ఆర్టికల్ 35-ఎను కూడా రద్దు చేస్తామని షా ప్రకటించారు. దీంతో ఈ అంశంపై కూడా షా దుందుడుకుగా వ్యవహరించే అవకాశం ఉంది. అంతే కాదు జమ్మూ కశ్మీర్‌లోని భద్రతా బలగాలకు మరిన్ని అధికారాలు కట్టబెడతారనే వాదన వినిపిస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com