ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్!
ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 13 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జేఏసీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై కొత్త ప్రభుత్వం స్పందించాలన్నారు. సంస్థ నష్టాలను ప్రభుత్వమే భరించాలని.. సిబ్బంది కుదింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని.. ఇప్పుడు జగన్ నిలబెట్టుకోవాలన్నారు ఆర్టీసీ సంఘం నేతలు.
ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఆర్టీసీ బయటపడాలంటే… ఈ ఏడాది బడ్జెట్‌లో 3వేల కోట్లు కేటాయించాలన్నారు జేఏసీ నేతలు. సమ్మె సన్నాహాల్లో భాగంగా.. 3న రాజమండ్రి, 4న విశాఖ, 6న ఒంగోలు, 7న తిరుపతి, నెల్లూరు ఏలూరు, 8న కడప, 9న అనంతపురం, కర్నూలు, 10న గుంటూరు, 11న కృష్ణా రీజియన్‌లో సభలు నిర్వహిస్తామన్నారు.
ఈ నెల 12 నుంచి దూర ప్రాంత సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం చేకూర్చాలన్నది తమ లక్ష్యం కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యమే.. తమను సమ్మెలోకి వెళ్లేలా చేసిందంటున్నారు జేఏసీ నేతలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com