చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

భారత ప్రజా జీవనంలో నైరుతి రుతుపవనాలు ఓ భాగం. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అవి సకాలంలో రాకపోయినా… సరిగా ప్రభావం చూపకపోయినా దేశం తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది. ద్రవ్యోల్బణం, మార్కెట్లు, జాతీయ వృద్ధిరేటు, ఇలా అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది వర్షం.. మన జాతీయ బడ్జెట్‌ను వర్షాధారపు జూదంగా ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. అందుకే రుతుపవనాలకు అంత ప్రాధాన్యం..

సీజన్‌లో ఒక దిశలో వీచే గాలి తిరుగుముఖం పట్టడం లేదా దిశమార్చుకోవడాన్ని రుతుపవనంగా పేర్కొంటారు. నైరుతిలేని భారతదేశాన్ని ఊహించలేం. ఎందుకంటే 75 శాతం వర్షపాతానికి ఇవే కారణం. ఈ సీజన్‌లో కురిసే వర్షాలతోనే వ్యవసాయం కుదుటపడుతుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్, నికోబార్ దీవులలో విస్తరించాయని IMD ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రంలోని అత్యధిక భాగానికి విస్తరించనున్నాయి. సాధారణంగా రుతుపవనాలు జూన్ -1నే దేశంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ సారి కాస్త ఆలస్యంగా జూన్ 6న వచ్చే అవకాశం ఉందని IMD పేర్కొంది.

అయితే రుతుపవనాల రాకతో వర్షపాతానికి సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదు. గత అనుభవాలు ఇవే చెబుతున్నాయి.. 2014లో జూన్ 5న, 2015లో జూన్ 6న, 2016లో జూన్ 8న రుతుపవనాలు వచ్చాయి. 2018లో మే 29నే కేరళను తాకాయి. అంత త్వరగా రుతుపవనాలు వచ్చినప్పటికీ వర్షపాతం సాధారణం కన్నా తక్కువే కురిసింది. ఈసారి కూడా లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story