జగిత్యాల కథ మళ్లీ మొదటికే వచ్చింది

జగిత్యాల కథ మళ్లీ మొదటికే వచ్చింది

చిన్న జిల్లాలతో మాత్రమే మంచి పరిపాలన సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించేవారు. అలా ఏర్పాటైన జిల్లాల్లో జగిత్యాల ఒకటి. జిల్లాగా ఆవిర్భావం జరిగిందనే సంబరం తప్ప.. అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడలేదు. నేతలు మారుతున్నారే తప్ప ప్రజల తలరాతలు మారడంలేదు. 40 ఏళ్లుగా జగిత్యాల రాజకీయ ఉద్దండలుగా పేరుగాంచిన జీవన్ రెడ్డి, ఎల్.రమణలే జగిత్యాల ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. విశేషమేమిటంటే… వీళ్లిదరు చెరోదఫా గెలిచినా… మరో పార్టీ అధికారంలో ఉండేది. అధికార, ప్రతిపక్షాల మధ్య నలుగుతూ జగిత్యాల జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు.

జగిత్యాల నుంచి ఎవరు గెలిచినా విపక్షంలో ఉండటంతో అధికారాలు ఉండవు. వచ్చే అరకొర నిధులు జగిత్యాల ప్రజలకు శాపంగా మారుతున్నాయి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో… ఇక్కడి నుంచి TRS తరపున సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి అధికారపార్టీ గెలవడంతో అభివృద్ధి జరుగుతుందని అందరూ భావించారు. కానీ జగిత్యాలకు మళ్లీ ఊహించనిరీతిలో ఎమ్మెల్యేగా ఓడిన జీవన్ రెడ్డి, MLCగా గెలిచి మళ్లీ తెరపైకి వచ్చారు.

ఓవైపు TRS సిట్టింగ్ ఎంపీ కవిత.. TRS ఎమ్మెల్యే గెలుపుతో ఇక తమ నియోజకవర్గ అభివృద్ధి గాడిలో పడుతుందని అనుకున్నారు. ఈ లోగా లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కవితపై బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ గెలవడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది. ఇన్నాళ్లూ…రెండు పార్టీల మధ్య జగిత్యాల జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు అనుకునేవారు. ఇప్పుడు బీజేపీ కూడా చేరడంతో… మూడు పార్టీల నేతల వల్ల అభివృద్ధి జరుగుతుందా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story