ట్రంప్ నిర్ణయం వలన భారత్ కు తక్షణం నష్టం లేదు : నిపుణులు

ట్రంప్ నిర్ణయం వలన భారత్ కు తక్షణం నష్టం లేదు : నిపుణులు

GSP-జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ అంటే సాధారణ ప్రాధాన్య వ్యవస్థ. ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్‌, థాయిలాండ్‌, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు. అయితే, ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధివిధానాలను అనుసరించాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్లలో అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి. కానీ భారత్ అధిక సుంకాలు విధించి మార్కెట్లకు తగిన యాక్సెస్ ఇవ్వడం లేదన్నది ట్రంప్ ఆరోపణ.

వర్థమానదేశాలకు అందుతున్న GSP హోదా కింద ఇప్పటివరకూ గరిష్ఠంగా లాభపడుతున్నది మన దేశమే. మనతోపాటు వేటుపడబోతున్న టర్కీ ఐదోస్థానంలో ఉన్నది. అమెరికాకు భారత్ ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా ఏడాదికి 39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్‌పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా భారత్‌ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు ట్రంప్. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించారు.

జీఎస్పీ హోదా తొలగిస్తే.. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే దాదాపు 5.6 బిలియన్‌ డాలర్ల సరుకులపై భారీగా పన్నులు పడే అవకాశం ఉంది. ఇది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ కానుంది. అంతేకాదు దాదాపు 2,000 రకాల వస్తువలపై అదనపు ఛార్జీల భారం పడుతుంది. ముఖ్యంగా మనదేశంలోని చిన్న వ్యాపారాలు, ఆభరణాల రంగం ప్రభావితం కానున్నాయి.

అయితే GSP తొలగించడంవల్ల భారత్ కు తక్షణం జరిగే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు నిపుణులు.గట్టిగా 19 కోట్ల డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు. అయితే అమెరికాకు కూడా అదే స్థాయిలో నష్టం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే…జీఎస్పీ దేశాల నుంచి దిగుమతులు చేసుకోవటం వల్ల అమెరికన్‌ కంపెనీలు 2019 మార్చిలో 105 మిలియన్‌ డాలర్లు ఆదా చేయగలిగాయి. ఆ హోదా తొలగిస్తే ఈ మేరకు అమెరికా కంపెనీలపైనా ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది మొత్తానికి మరో వాణిజ్యయుద్ధమే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే చైనాతో ట్రేడ్ వార్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు ట్రంప్. ఇప్పుడు భారత్ పైన పడ్డారు. అంటే తమ చెప్పుచేతల్లోలేని దేశాలను వ్యాపార పరంగా దెబ్బతీయడమే అమెరికా చేస్తున్న సరికొత్త యుద్ధమన్న విమర్శలు వినిపిస్తున్నాయి…

Tags

Next Story