ఆంధ్రప్రదేశ్

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గట్టెక్కాలంటే ఎంత డబ్బు కావాలంటే..

రాష్ట్ర ఆదాయం, జమాఖర్చులపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. కొత్త ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్థిక శాఖ అధికారులు నివేదక సమర్పించారు. ఎక్కడ ఆదాయం తగ్గుతుంది, ఎక్కడ ఖర్చులు పెరుగుతున్నాయో లెక్కించి.. 39 వేల 815 కోట్లు అదనంగా సమకూర్చుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం గట్టెక్కే వీలుంటుందని అందులో తెలిపారు. ఆ మేరకు ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకోవాలన్నది ఆ నివేదిక సారాంశంగా చెప్తున్నారు.

2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు సుమారు 12 వేల కోట్లుగా లెక్కించగా.. అది వచ్చే అవకాశం లేదని అధికారుల అభిప్రాయం. విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 10వేల కోట్లు అంచనా వేసిన మొత్తం రాకపోవచ్చని లెక్కిస్తున్నారు. కేంద్రం నుంచి 90శాతం సాయం అందుతుందనుకున్నా తాజా పరిస్థితుల్లో అది 60శాతానికే పరిమితం కావొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయాల్లో 5 వేల కోట్ల వరకు లోటు ఉంటుందని, మొత్తమ్మీద 26 వేల 728 కోట్ల ఆదాయం తగ్గుతుందనేది తేల్చి చెప్తున్నారు. ఇక, జగన్ ప్రకటించిన కొత్త పథకాలైన వైఎస్సార్ పెన్షన్ల పెంపు, గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకం తదితరాల అమలుకు 6 వేల 265 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. వివిధ కార్పొరేషన్లకు అంతే మొత్తంలో అవసరాలు ఉన్నాయి. అన్నీ కలిపితే 12 వేల 615 కోట్లు అదనపు బడ్జెట్‌ అవసరమవుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

రాబడి మార్గాలను పరిశీలిస్తే.. కేంద్రం మద్దతుతో రెవెన్యూ గ్రాంటు లోటు 10వేల కోట్లు రాబట్టుకోవాలి. రాష్ట్ర ఆదాయాన్ని పకడ్బందీగా క్రమబద్దీకరించుకుంటే.. 5 వేల కోట్ల లోటును కవర్‌ చేసుకోవచ్చు. ఇసుకపై సీనరేజి విధిస్తే 2వేల కోట్లు సమకూరుతుంది. నీటిపన్ను సవ్యంగా వసూలు చేయగలిగితే 500 కోట్లు వస్తుంది. ఇలా మొత్తం 17న్నర వేల కోట్లు లోటు పూడ్చుకునే అవకాశం ఉంది.

మరోవైపు.. ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ఏపీకి హోదా ఎంత అవసరమోో సమగ్ర వాదన సిద్ధం చేసి 15వ ఆర్థిక సంఘం ముందు వినిపించాలని సూచించారు. సామాన్యులపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమగ్ర మద్యం పాలసీ, ఇసుక విధానాలు సిద్ధం చేయాలని జగన్ సూచించారు. హరిత పన్ను, ఎర్రచందనం అమ్మకాలు, ఇసుక పాలసీతో పాటు రుణాలు తీసుకునే విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

26వేల కోట్ల వరకు కోత పడొచ్చు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తున్న ఆదాయాల్లో రమారమి రూ.26వేల కోట్ల వరకు కోత పడవచ్చని తాజాగా అధికారులు వివరించారు. రాష్ట్ర సొంత ఆదాయంలో రూ.5000 కోట్లు, కేంద్రం నుంచి వస్తుందని ఆశిస్తున్న సొమ్ములో రూ.21వేల కోట్ల వరకు కోత పడుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి మరింత సాయం పొందడమే ముఖ్యమని అధికారులు కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతూనే.. దీనిపై ఎక్సైజ్‌ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ఉచిత ఇసుక విధానం స్థానే సమగ్ర విధానం తీసుకురావాలని జగన్‌ అధికారులకు నిర్దేశించారు. ఎర్రచందనం ద్వారానూ ఆదాయాన్ని మరింత సముపార్జించాలన్నారు. హరిత పన్ను, వ్యర్థ పదార్థాలపై పన్నుల వంటి వాటి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని పేర్కొన్నారు. వాస్తవం కన్నా అనేక రెట్లు ఎక్కువగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని చూపించి అప్పులు ఎక్కువగా తెచ్చుకునేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రుణ విధానాన్ని సమూలంగా మార్చాలని, తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. కోట్ల రూపాయల జీపీఎఫ్‌ దారి మళ్లించడంపైనా సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పౌరసరఫరాలు, జలవనరులు, ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ.6,265 కోట్ల రుణాలు సమీకరించి వాటిని పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ వంటి వాటికి మళ్లించడంపైనా జగన్‌ విస్తుపోయారు.

ప్రభుత్వ ప్రాధామ్యాల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు సూచించారు. తాము ఇచ్చిన హామీలు, ప్రాధాన్యాల అమలుకు ఎంత ఖర్చవుతుంది? వనరుల సమీకరణ ఎలా సాధ్యమన్న అంశాలతో నివేదిక రూపొందించాలని సీఎం నిర్దేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, విశ్రాంత ప్రధాన కార్యదర్శి అజేయకల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పి.వి.రమేష్‌, ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES